రిస్క్‌లో రూ.1 లక్ష కోట్ల రుణాలు, క్రెడిట్ కార్డ్ జారీలో అప్రమత్తం
గత ఏడాది ఆర్థిక మందగమనం, 2020లో కరోనా మహమ్మారి కారణంగా భారత ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్నది. మోసాల కారణంగా బ్యాంకుల ఎన్పీఏలు/మొండి బకాయిలు పెరుగుతున్నాయి. వైరస్‌కు తోడు లోన్ మారటోరియం వంటి కారణాలతో బ్యాంకులపై భారం పడుతోంది. క్రెడిట్ కార్డులపై రుణాలు కూడా బ్యాంకులకు భారంగా మారాయి. మొత్తం క్రెడిట్ కార్డు బకాయిలు రూ.1 లక్ష కోట్లకు చేరుకున్నాయట. దీంతో బ్యాంకులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నాయి. రాబోయే కొన్నేళ్లలో అన్-సెక్యూర్డ్ లోన్ డిఫాల్ట్‌లు పెరిగే అవకాశం ఉందని బ్యాంకింగ్ రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు.
Loan Moratorium: దరఖాస్తు అవసరంలేదు, వారికీ ప్రయోజనం.. వడ్డీ మాఫీపై మరో ఊరట!

లక్షకోట్ల రుణాలు.. బ్యాంకుల అప్రమత్తం
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) విడుదల చేసిన క్రెడిట్ కార్డ్ డేటా ప్రకారం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోని మొదటి ఐదు నెలల్లో మూడు శాతం ప్రతికూలత నమోదు చేసింది. క్రెడిట్ కార్డు రుణాలు రూ.1 లక్ష కోట్లుగా ఉన్నాయి. గత కొద్ది నెలలుగా క్రెడిట్ కార్డు జారీ సమయంలో బ్యాంకర్లు ఎంతో అప్రమత్తంగా ఉంటున్నారని ఇటీవల ఓ వార్తలు వచ్చాయి. ముఖ్యంగా చెల్లింపులు ఆలస్యం చేసే కస్టమర్లకు, డిఫాల్ట్ చరిత్ర కలిగిన కస్టమర్లకు క్రెడిట్ కార్డులు ఇచ్చే విషయంలో జాగ్రత్త వహిస్తున్నారు.

ప్రమాదకర సంకేతాలు
దేశీయ అతిపెద్ద ప్రభుత్వరంగ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) కార్డు అనుబంధ సంస్థ ఎస్బీఐ కార్డ్స్ అండ్ పేమెంట్స్‌కు సంబంధించిన కార్డు రుణాల్లో ప్రమాదకరంగా సంకేతాలు కనిపిస్తున్నట్లుగా చెబుతున్నారు. దేశంలో రెండో అతిపెద్ద క్రెడిట్ కార్డు మార్కెట్ కలిగి ఉన్న ఎస్బీఐ ఎన్పీఏలు 2020-21 రెండో త్రైమాసికంలో 4.29 శాతానికి పెరిగాయి. అంతకుముందు కంటే రెండింతలు పెరిగాయి. మార్చి 1 నుండి ఆగస్ట్ 31వ తేదీ వరకు లోన్ మారటోరియం అమల్లో ఉన్నప్పటికీ స్థూల ఎన్‌పీఏల్లో పెరుగుదుల కనిపించడం గమనార్హం. బ్యాంకులు ఇప్పుడు ఆదాయ నష్టం లేదా ఉద్యోగ నష్టం కారణంగా రుణాలు చెల్లించలేని వారికి రెండేళ్ల పునర్నిర్మాణ రుణ సౌకర్యం కల్పించాయి. ఆగస్ట్ వరకు లోన్ మారటోరియం ఉంది. ఆర్బీఐ క్రెడిట్ కార్డు డేటా ప్రకారం రూ.లక్ష కోట్లకు పైగా కార్డు రుణాలు ఉన్నాయి. మందగమనం కారణంగా ఇందులో చాలా మొత్తం రిస్క్‌లో ఉన్నట్లుగా భావిస్తున్నారు.

భారత్‌లో కాదు.. ప్రపంచమంతా ఇంతే
2020-21 ఆర్థిక సంవత్సరం మొదటి ఐదు నెలల్లో మొత్తం క్రెడిట్ కార్డు వ్యాపారం మూడు శాతం ప్రతికూలంగా ఉంది. గత ఏడాది ఇదే కాలంలో 10 శాతం వృద్ధిని నమదు చేసింది. క్రెడిట్ కార్డ్ వంటి అసురక్షిత రుణాలపై ఎక్కువ మంది డిఫాల్టుగా నమోదవుతుండటంతో బ్యాంకులు మరింత జాగ్రత్తగా ఉండే అవకాశాలు ఉన్నాయి. గత అయిదేళ్లలో వ్యక్తిగత రుణాలు, క్రెడిట్ కార్డు విభాగంలో ఎక్కువ వృద్ధి నమోదయినప్పటికీ ఎక్కువగా చెల్లింపులు ఆలస్యం అవుతున్నాయి. అయితే కరోనా, మందగమనం కారణంగా భారత్‌లో మాత్రమే ఎక్కువ డిఫాల్ట్‌లు నమోదు కావడంకాదు. ప్రపంచవ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొన్నదని, ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్లో డిఫాల్టులు పెరుగుతాయని భావిస్తున్నారు.

ఎన్పీఏలు ఇప్పటికిప్పుడు తెరపైకి రాకపోవచ్చు
దీర్ఘకాలిక మందగమనం నేపథ్యంలో ప్రజలు కూడా తమ క్రెడిట్ కార్డు రుణాలను లేదా వ్యక్తిగత రుణాల చెల్లింపులను మరింతకాలం ఆలస్యం చేసే అవకాశాలు ఎక్కువ. ఏదేమైనా ఇప్పటికిప్పుడు అన్ని ఎన్పీఏలు తెరపైకి రాకపోవచ్చునని అంటున్నారు. రుణ పునర్నిర్మాణం వంటి కారణాలతో తర్వాత వెలుగు చూస్తాయని చెబుతున్నారు. ఎస్బీఐ కార్డ్స్ అండ్ పేమెంట్స్ రూ.21.08 కోట్లను ఇప్పటికే లోన్ రీస్ట్రక్చరింగ్ స్కీం కిందకు మార్చాయని చెబుతున్నారు. డిఫాల్ట్స్ నేపథ్యంలో 10 శాతం ప్రొవిజనింగ్ ఉండాలని ఆర్బీఐ.. బ్యాంకులకు సూచన చేసింది. అయితే ఎన్పీఏలు విపరీతంగా పెరిగితే ఫలితం లేదంటున్నారు.