రూ.27,000 కోట్ల డీల్, రిలయన్స్ చేతికి ఫ్యూచర్ రిటైల్! ముఖేష్ అంబానీ కొనుగోలు వెనుక..
ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్.. ఫ్యూచర్ గ్రూప్ రిటైల్‌ను స్వాధీనం చేసుకునే సన్నాహాల్లో ఉంది. ఇందుకు రూ.24,000 కోట్ల నుండి రూ.27,000 కోట్ల మధ్య (3.2 బిలియన్ డాలర్ల నుండి 3.6 బిలియన్ డాలర్లు) మధ్య చెల్లించే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు. ఇప్పటికే రిలయన్స్ రిటైల్ ఆపరేషన్స్ కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. దేశంలోని 6,700 పట్టణాలు, నగరాల్లో 12,000 స్టోర్స్ ఉన్నాయి. మరింత బలోపేతం కోసం ఇండియా ఫాదర్ ఆఫ్ మోడర్న్ రిటైలింగ్ కిషోర్ బియాని ఆధ్వర్యంలోని ఫ్యూచర్ గ్రూప్ సూపర్ మార్కెట్‌ను రిలయన్స్ కొనుగోలు చేయనుంది. ఇందుకు సంబంధించి చర్చలు తుదిదశలో ఉన్నాయని తెలుస్తోంది. త్వరలో ఒప్పందం కుదిరే అవకాశముంది.
74 లక్షల షేర్లు విక్రయించిన ఆదిత్యపురి, HDFC షేర్లు ఢమాల్! బ్యాంకు ఏం చెప్పిందంటే..

వాటాల విక్రయానికి సన్నద్ధం
బిగ్ బజార్, ఫుడ్దాల్, నీలగిరీస్, బ్రాండ్ ఫ్యాక్టరీ, సెంట్రల్ వంటి బ్రాండ్స్‌తో ఫ్యూచర్ గ్రూప్ రిటైల్ స్టోర్స్ నిర్వహిస్తోంది. గత సంవత్సరం సెప్టెంబర్ నాటికి ఫ్యూచర్ గ్రూప్‌లోని ఐదు లిస్టెడ్ కంపెనీలపై రుణ భారం రూ.12,770 కోట్లకు పెరిగింది. కిషోర్ బియానీ ఫ్యామిలీ హోల్డింగ్ కంపెనీలపై దాదాపు ఇంతే రుణభారం ఉంది. అంతేకాకుండా హోల్డింగ్ కంపెనీల చేతుల్లోని మెజార్టీ షేర్లు తాకట్టులో ఉన్నాయి. దీని నుండి బయటపడేందుకు ఫ్యూచర్ రిటైల్‌తో పాటు ఇతర సంస్థల వాటాలు విక్రయించేందుకు సిద్ధమయ్యారు.

అందుకే ఫ్యూచర్ గ్రూప్ రిటైల్ కొనుగోలు
దేశీయంగా ఈ-కామర్స్ బిజినెస్ ఇప్పుడు దాదాపు రూ.ఆరు లక్షల కోట్ల స్థాయిలో ఉంది. వచ్చే అయిదేళ్లలో అంటే 2025 నాటికి ఏడున్నర లక్షల కోట్ల స్థాయికి చేరుతుందని అంచనాలు ఉన్నాయి. దీంతో కంపెనీలు నిత్యావసర విభాగంపై దృష్టి సారించాయి. ఆన్లైన్ మార్కెట్లో గత ఏడాది వరకు మెజార్టీ వాటా బిగ్ బాస్కెట్, గ్రోఫర్స్దే. ప్రస్తుతం జియో మార్ట్ వాట్పాప్ సాయంతో ప్రారంభించింది. జియోమార్ట్ అధిక మార్కెట్‌ను చేజిక్కించుకుంటుందనే అంచనాలు ఉన్నాయి.
మరోవైపు, దాదాపు రూ.72 లక్షల కోట్ల విలువైన దేశీయ రిటైల్ మార్కెట్ 2025 నాటికి రూ.97 లక్షల కోట్లకు పైగా చేరుకుంటుందని అంచనాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో రిటైల్ మార్కెట్లో పట్టు కోసం అన్ని కంపెనీలు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఆన్లైన్లో జియో మార్ట్ ద్వారా దూసుకొచ్చారు. ఇప్పుడు సంప్రదాయ రిటైల్ మార్కెట్లో అగ్రస్థానంలో నిలిచేందుకు ఫ్యూచర్ గ్రూప్ రిటైల్‌ను కొనుగోలు చేస్తున్నారు.

రిలయన్స్ నెంబర్ వన్..
ఫ్యూచర్ గ్రూప్ రిటైల్ కింద బిగ్ బజార్, ఫ్యాషన్ ఎట్ బిగ్‌బజార్, బ్రాండ్ ఫ్యాక్టరీ, ఇజోన్ పేరిట 1500కు పైగా స్టోర్స్ ఉన్నాయి. రిలయన్స్-ఫ్యూచర్ గ్రూప్ మధ్య చాలాకాలంగా చర్చలు జరుగుతున్నాయి. అయితే ఫ్యూచర్ రిటైల్ వ్యాల్యూపై ప్రతిష్టంభన కొనసాగుతోంది. రుణాలతో కలిపి ఈ కొనుగోలు ఉంటుందని అంచనా. రిలయన్స్ అనుబంధ రిటైల్ ఆధీనంలోకి రాకముందే ఫ్యూచర్ రిటైల్ సహా 5 లిస్టెడ్ సంస్థలు ఫ్యూచర్ ఎంటర్‌ప్రైజెస్‌లో విలీనం అవుతాయని తెలుస్తోంది. అప్పుడు దేశంలోని అతిపెద్ద రిటైల్‌గా రిలయన్స్ ఉంటుంది.

జివామే మొత్తం వాటా కోసం రిలయన్స్ చర్చలు
ఇదిలా ఉండగా లోదుస్తుల రిటైల్ విక్రయ సంస్థ జివామేను రిలయన్స్ బ్రాండ్స్ కొనుగోలు చేయనున్నాయని తెలుస్తోంది. ఇప్పటికే రోనీస్క్రూవాలాకు చెందిన యూనిలేజర్ వెంచర్స్‌కు ఈ కంపెనీలో 15 శాతం ఉన్న వాటాను రిలయన్స్ బ్రాండ్స్ గత వారం కొనుగోలు చేసింది. మిగిలిన 85 శాతం వాటా కొనుగోలుకు జోడియస్ క్యాపిటల్, మలేషియా ప్రభుత్వ ఫండ్ ఖజానా నేషనల్ బెర్హాద్‌తో చర్చలు జరుపుతోంది. జివామే కోసం రూ.1,200 కోట్లు ఖర్చు చేస్తోందని తెలుస్తోంది.