బిగ్ షాక్: రిలయన్స్-ఫ్యూచర్ గ్రూప్ మధ్య రూ.24,713 కోట్ల డీల్ రద్దు
ముంబై: దేశీయ పారిశ్రామిక దిగ్గజం ముఖేష్ అంబానీ సారథ్యంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్.. సంచలన నిర్ణయాన్ని తీసుకుంది. ఫ్యూచర్ గ్రూప్ మొత్తాన్నీ టేకోవర్ చేసుకోవడానికి కుదుర్చుకున్న ఒప్పందాన్ని రద్దు చేసుకుంది. ఈ మేరకు రిలయన్స్ ఇండస్ట్రీస్ ఓ ప్రకటన విడుదల చేసింది. దీన్ని మార్కెట్ రెగ్యులేటర్స్‌కు సమర్పించింది. ఈ ఒప్పందం విలువ 24,713 కోట్ల రూపాయలు. ఇంత బిగ్ డీల్‌ను రద్దు చేసుకోవడానికి గల కారణాలను వివరించింది.

ఫ్యూచర్ గ్రూప్ పరిస్థితేంటీ?
ఈ కాంట్రాక్ట్ రద్దుతో రిటైల్ దిగ్గజం ఫ్యూచర్ గ్రూప్ భవిష్యత్ ఇక ప్రశ్నార్ధకంగా మారినట్టే. అప్పుల్లో కూరుకుపోయి రుణాలు చెల్లించలేక దివాళా స్థితికి చేరిన ఈ కంపెనీ చివరి ప్రయత్నాలు కూడా ఫలించలేదు. తన కంపెనీ మొత్తాన్నీ రిలయన్స్ రిటైల్‌కు విక్రయిస్తూ ఫ్యూచర్ రిటైల్ చేసుకున్న ఒప్పందంతో మళ్లీ గాడిన పడొచ్చంటూ భావించినప్పటికీ.. ఆ ప్రయత్నాలేవీ ఫలించలేదు. ఈ ఒప్పందంలో పొందుపరిచిన అంశాలు ఏ మాత్రం ఆచరణ సాధ్యం కాబోవని వాటాదారులు, బ్యాంకర్లు అభిప్రాయపడ్డారు.

డీల్‌కు వ్యతిరేకంగా ఓటు..
సుదీర్ఘకాలం పాటు న్యాయపరమైన వివాదాలను ఎదుర్కొనడం, అమెజాన్ ముందు నుంచీ ఈ డీల్‌ను వ్యతిరేకిస్తూ వస్తోండటం వంటి పరిణామాల నేపథ్యంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్- ఈ డీల్‌ను క్యాన్సిల్ చేసుకుంది. దీనిపై మెజారిటీ బ్యాంకర్లు, వాటాదారులు ఆమోద ముద్ర వేయలేదు. దీనిపై నిర్వహించిన ఓటింగ్ సందర్భంగా సెక్యూర్డ్ క్రెడిటర్స్ ఈ డీల్‌కు వ్యతిరేకంగా ఓటు వేశారు. దీనితో రద్దు నిర్ణయాన్ని తీసుకోవాల్సి వచ్చినట్లు రిలయన్స్ ఇండస్ట్రీస్ తన ప్రతిపాదనల్లో వివరించింది.

అంగీకరించని వాటాదారులు..
రిలయన్స్ రిటైల్‌లో ఫ్యూచర్స్ గ్రూప్ విలీనానికి వాటాదారులు, అనుబంధ సంస్థలు, రుణాలు ఇచ్చిన బ్యాంకులు ఈ ఓటింగ్‌లో పాల్గొన్నాయి. రుణ దాతలు, వాటాదారుల్లో మెజారిటీ మద్దతు కూడగట్టడంలో ఫ్యూచర్ విఫలమైతే బ్యాంకర్ల రుణ బకాయిల్లో తక్కువ మొత్తంలో మాత్రమే రికవరీ అవుతాయి. కెనరా బ్యాంకు, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, మెజారిటీ రిలయన్స్‌లో ఫ్యూచర్ విలీనానికి అంగీకరించలేదు.

21 నెలల తరువాత..
ఈ డీల్ కుదరిన 21 నెలల తరువాత ఈ పరిణామం చోటు చేసుకుంది. ఫ్యూచర్స్ గ్రూప్‌ను రుణాలతో పాటు కరోనా వైరస్ వ్యాప్తి చెందిన పరిస్థితులు వెంటాడాయి. లాక్డౌన్ వంటి పరిణామాల నేపథ్యంలో ఫ్యూచర్ రిటైల్స్ ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుంది. జీతాలు సైతం చెల్లించలేని పరిస్థితికి చేరింది. ఈ నేపథ్యంలో రిలయన్స్ రిటైల్‌లో విలీనానికి ఒప్పందం కుదుర్చుకుంది. దీనిపై ఇ-కామర్స్ జెయింట్ అమెజాన్‌తో ఫ్యూచర్ న్యాయ వివాదాన్ని ఎదుర్కొంది. ఈ డీల్‌ను వ్యతిరేకిస్తూ అమెజాన్ న్యాయపోరాటం చేసింది.

2020లో ఒప్పందం..
ఫ్యూచర్ గ్రూపునకు చెందిన రిటైల్‌తోపాటు హోల్‌సేల్ బిజినెస్, లాజిస్టిక్స్, గోడౌన్స్ మేనేజ్మెంట్ను రిలయన్స్ రిటైల్ వెంచర్స్, రిలయన్స్ రిటైల్ అండ్ ఫ్యాషన్ లైఫ్‌స్టైల్‌కు విక్రయించడానికి 2020 ఆగస్టులో ఈ ఒప్పందం కుదిరింది. ఫ్యూచర్ గ్రూప్‌లో అంతకుముందే 10 శాతం వాటాలను కొనుగోలు చేసిన అమెజాన్.. దీన్ని వ్యతిరేకిస్తూ వస్తోంది. న్యాయపోరాటం చేసింది. సుదీర్ఘకాలంగా ఇది కొనసాగింది. చివరికి- ఇలా కార్యరూపాన్ని దాల్చకుండానే రద్దయింది.