మూడు బ్యాంకుల 'మోసం' ఆరోపణలు, అనిల్ అంబానీకి భారీ షాక్
రిలయన్స్ కమ్యూనికేషన్స్ (RCom) అధినేత అనిల్ అంబానీకి షాక్. RCoMతో పాటు ఆయన ఆధ్వర్యంలోని రిలయన్స్ టెలికం లిమిటెడ్(RTel), రిలయన్స్ ఇన్ఫ్రాటెల్ లిమిటెడ్(RInfra)లను మూడు బ్యాంకులు ఫ్రాడ్గా ప్రకటించాయి. ప్రభుత్వరంగ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI), యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(UBI), ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు(IOB)లు ఈ మేరకు ప్రకటించాయి. కాగా, భారతీయ బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు తమ గ్రూప్ దాదాపు రూ.26,000 కోట్లు బాకీ ఉందని రిలయన్స్ కమ్యూనికేషన్స్ బుధవారం తెలిపింది. బ్యాంకులు, విక్రేతలు, ఇతర రుణదాతలు ఈ సంస్థపై దాదాపు రూ.86,000 కోట్ల ఇన్సాల్వెన్సీ ప్రొసీడింగ్స్ చేశారు.
రిలయన్స్ ఎఫెక్ట్, ముఖేష్ అంబానీని దాటేసిన చైనీస్ కుబేరుడు జోంగ్ షంషాన్

ఎవరెంత చెబుతున్నారంటే
రుణదాతలు నియమించిన రిజల్యూషన్ ప్రొఫెషనల్ ధృవీకరించిన గణాంకాల ప్రకారం ఎన్సీఎల్టీ ముందు దాఖలు చేసిన తేదీ నాటికి RCoM బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు రూ.26,000 కోట్లు బాకీ పడుతుందని రిలయన్స్ కమ్యూనికేషన్స్ ప్రకటనలో తెలిపింది. రుణదాతలు మాత్రం RCoM నుండి రూ.49,000 కోట్లు, రిలయన్స్ టెలికాం రూ.24,000 కోట్లు, రిలయన్స్ ఇన్ఫ్రాటెల్ రూ.12,600 కోట్లుగా పేర్కొన్నాయి. ఈ మేరకు నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్(NCLT) ఎదుట వాదనలు వినిపించాయి.

ఆర్.కామ్. ఖండన
అయితే, బ్యాంకుల ఫ్రాడ్ (మోసం) వర్గీకరణపై రిలయన్స్ కమ్యూనికేషన్స్ స్పందించింది. తమపై మోసం ఆరోపణలు అన్యాయమైనవి, అనవసరమైనవి అని రిలయన్స్ కమ్యూనికేషన్స్ తెలిపింది. ఢిల్లీ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వుల ద్వారా దీనిని ప్రస్తుతానికి నిలిపివేయాలని కోరింది. రుణదాతలు ఏకగ్రీవంగా ఆమోదించిన తీర్మాణ ప్రణాళికలు ఎన్సీఎల్టీ ముందు ఆమోదం యొక్క వివిధ దశలలో ఉన్నాయని తెలిపింది.

మాల్యా, నీరవ్ల కంటే పదిరెట్లు
2016లో కొత్త టెల్కో రంగ ప్రవేశం తర్వాత టెలికం రంగం తీవ్ర ఒత్తిడికి గురయింది. ఎయిర్సెల్, సిస్టేమా, వీడియోకాన్, టాటా డొకొమో సహా వివిధ టెల్కోలు క్లోజ్ అయ్యాయి. వొడాఫోన్ వంటి ప్రపంచ దిగ్గజ సంస్థలు కూడా ప్రభావితమయ్యాయి. ఇదే విషయాన్ని ఆర్.కామ్. గుర్తు చేసింది. కాగా, రిలయన్స్ కమ్యూనికేషన్ సహా మూడు సంస్థల రుణాలు రూ.86,188 కోట్లుగా బ్యాంకులు తెలిపాయి. ఇది విజయ్ మాల్యా, నీరవ్ మోడీ బ్యాంకులకు ఎగ్గొట్టిన రుణాల కంటే దాదాపు పది రెట్లు.