రిలయన్స్ ఇండస్ట్రీస్ అదుర్స్, మార్కెట్ క్యాప్ రూ.19 లక్షల కోట్లు క్రాస్
ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.19 లక్షల కోట్ల మార్కును క్రాస్ చేసింది. ఈ అరుదైన ఘనత సాధించిన తొలి భారతీయ కంపెనీ రిలయన్స్. రిలయన్స్ షేర్లు సరికొత్త రికార్డును తాకిన నేపథ్యంలో ఈ కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.19 లక్షల కోట్లను తాకింది. రిలయన్స్ షేర్ వ్యాల్యూ నేడు 1.85 శాతం ఎగిసి రూ.2827ను తాకింది. ఈ వార్త రాసే సమయానికి ఈ స్టాక్ 1.16 శాతం ఎగిసి రూ.2808 వద్ద ఉంది.
రిలయన్స్ షేర్ బీఎస్ఈలో రూ.2827ను తాకడంతో ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.19,12,184 కోట్లకు చేరుకుంది. ఈ ఏడాది మార్చి నెలలోనే కంపెనీ మార్కెట్ వ్యాల్యూ రూ.18 లక్షల కోట్లు దాటింది. గత ఏడాది అక్టోబర్ 13 కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.17 లక్షల కోట్లను తాకింది. వారం క్రితం కంపెనీ షేర్ వ్యాల్యూ 52 వారాల గరిష్టాన్ని తాకి రూ.2789 వద్ద ఉన్నప్పుడు కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.19 లక్షల సమీపానికి చేరుకుంది.

రిలయన్స్ 52 వారాల గరిష్టం రూ.2828, 52 వారాల కనిష్టం రూ.1906. రిలయన్స్ మార్కెట్ వ్యాల్యూ నెల రోజుల్లోనే రూ.18 లక్షల కోట్ల నుండి రూ.19 లక్షల కోట్లకు చేరుకుంది. 2022 క్యాలెండర్ ఏడాదిలో ఇప్పటి వరకు ఈ షేర్ ధర 19 శాతానికి పైగా పెరిగింది. అంతర్జాతీయంగా చమురు, గ్యాస్ ధరలు రికార్డ్ స్థాయిలో పెరిగాయని, మరోవైపు భౌగోళిక అనిశ్చితులు, ద్రవ్యోల్భణం వంటి అంశాలు రిలయన్స్, టెలికం వ్యాపారంపై ప్రభావం చూపడం లేదని, పైగా రెన్యూవబుల్ ఎనర్జీ వ్యాపారాన్ని మరింత విస్తరిస్తోందని, ఇవి మార్కెట్లో రిలయన్స్ షేర్ల ర్యాలీకి కారణం అయ్యాయని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.