క్రిప్టో డిజిటల్ కరెన్సీ, ఆస్తుల నియంత్రణ ఇబ్బంది: భారత్‌పై ఐఎంఎఫ్
భారత్‌కు కొన్ని మధ్యంతర నిర్మాణాత్మక ఇబ్బందులు ఉన్నాయని అంతర్జాతీయ ద్రవ్య నిధి(IMF) పేర్కొంది. అందులో డిజిటల్ కరెన్సీతో పాటు క్రిప్టో కరెన్సీ ఆస్తుల నియంత్రణ ఒకటి అని తెలిపింది. ఈ మేరకు ఐఎంఎఫ్ మానిటరీ క్యాపిటల్ మార్కెట్స్ విభాగం డైరెక్టర్ టోబియాస్ ఆడ్రియాన్ అన్నారు. బ్యాంకింగ్ రంగంలో మిగిలిన నియంత్రణ సమస్యల పరిష్కారంతో పాటు అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థతో దానిని ఏకీకృతం చేయడం భారత్ ముందు ఉన్న సమస్య అన్నారు.
భారత్‌ను తమ సంస్థ చాలా సానుకూల ధోరణితో చూస్తోందన్నారు. భారత్‌లో వృద్ధి పునరుద్ధరణకు తగిన అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నట్లు తెలిపారు. కొత్త వృద్ధి అవకాశాలు, పరిణామాలను సానుకూలంగా తీసుకోవడానికి భారత్ చాలా ఉత్సాహంగా ఉందన్నారు. అన్ని వర్గాలకు విస్తృత ప్రాతిపదికన అభివృద్ధి ఫలాలు అందాలని ఐఎంఎఫ్ కోరుకుంటోందన్నారు. క్రిప్టో నియంత్రణకు అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన నిబంధనలతో ముందుకు రావాలని ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు.

ఇప్పటికే క్రిప్టో ట్రాన్సాక్షన్స్ పైన భారత్ పన్ను విధానం ప్రవేశ పెట్టడాన్ని స్వాగతిస్తున్నామని, ఇక్కడ డిజిటల్ కరెన్సీతో పాటు అన్ని రంగాలకు వృద్ధి ఫలాలు అందడం చాలా కీలకం అన్నారు. ఇందుకు భారత్ ఎలా వ్యవహరిస్తుందనే విషయమై నిశితంగా ఐఎంఎఫ్ గమనిస్తుందన్నారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, వాణిజ్యంలో భాగం కావడం భారత్‌కు ప్రయోజనం అన్నారు. కరోనా వేళ భారత్ అనుసరించిన విధానంతో పెరుగుతున్న సావరీన్ రుణ భారంపై ఆందోళన అవసరం లేదన్నారు.