గోల్డ్ లోన్ కంపెనీకు ఆర్బీఐ షాక్: రూ.5, రూ.10 లక్షల జరిమానా
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) గురువారం ముథూట్ ఫైనాన్స్, మణప్పురం ఫైనాన్స్‌లకు వరుసగా రూ.10 లక్షలు, రూ.5 లక్షల జరిమానాను విధించింది. నిబంధనల ఉల్లంఘణ జరిగిందంటూ ఈ జరిమానా విధించారు. గోల్డ్ లోన్స్‌కు సంబంధించి లోన్ టు వ్యాల్యూ రేషియోను నిర్వహించకపోవడం, రుణగ్రహీతల పాన్ కార్డు కాపీని పొందే అంశంలో ఆర్బీఐ నిబంధనలు ఉల్లంఘించినట్లుగా పేర్కొంది. దీంతో ముథూట్ ఫైనాన్స్‌కు రూ.10 లక్షల జరిమానా విధించారు.
ముథూట్ ఫైనాన్స్ విభాగం మార్చి 31, 2018 - మార్చి 31, 2019 కాలంలో మార్గదర్శకాలను అనుసరించలేదని పేర్కొంది. రూ.5 లక్షలకు పైన బంగారు రుణాలు జారీ చేసేటప్పుడు రుణగ్రహీతల నుంచి పాన్ కార్డు తీసుకోవడమనే రూల్స్‌ను అనుసరించలేదని, అందుకే ఫైన్ వేసినట్లు తెలిపింది.

ఇక, గోల్డ్ జ్యువెల్లరీ ఓనర్షిప్ వెరిఫికేషన్ రూల్స్‌ను అనుసరించకపోవడంతో త్రిసూర్‌లోని మణపురం ఫైనాన్స్‌పై ఆర్బీఐ చర్య తీసుకుంది. రూ.5 లక్షల జరిమానా విధించింది. 2019 మార్చి 31 నాటికి సంస్థ ఆర్థిక స్థితిగతులను పరిశీలిస్తే, ఆర్బీఐ ఆదేశాలను పాటించలేదని తేలిందని చెప్పింది.