బ్యాడ్ బ్యాంకుపై RBI గవర్నర్ ఏమన్నారంటే? విదేశీ మారకపు నిల్వలు పెంచుకోవాలి
ముంబై: బ్యాడ్ బ్యాంక్ ఐడియాను పరిశీలిస్తామని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) గవర్నర్ శక్తికాంత దాస్ శనివారం సంకేతాలిచ్చారు. నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్(NPA) వంటి వాటిని పరిష్కరించడానికి బ్యాడ్ బ్యాంక్ అవసరమనే వాదనలు చాలా రోజులుగా వినిపిస్తున్నాయి. ఆర్బీఐ మాజీ గవర్నర్లు రఘురాం రాజన్, దువ్వూరి సుబ్బారావు సహా పలువురు బ్యాడ్ బ్యాంకు అవసరమని అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో దాస్ సానుకూల సంకేతాలు ఇచ్చారు. ముందుగానే నష్టాలను గుర్తించే వ్యవస్థలు ఉండాలని బ్యాంకులకు, నాన్-బ్యాంక్స్‌కు కూడా సూచించారు.
అమెరికా క్యాపిటల్ హింసకు ముందు వారికి భారీగా బిట్‌కాయిన్ పేమెంట్స్

బ్యాడ్ బ్యాంకు ప్రతిపాదనపై దాస్
'బ్యాడ్ బ్యాంకు ఏర్పాటు ప్రతిపాదన వస్తే ఆర్బీఐ తప్పకుండా పరిశీలిస్తుంది. అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీలకు సంబంధించి రెగ్యులేటరీ గైడెన్స్ ఉన్నాయి' అని శక్తికాంత దాస్ తెలిపారు. అయితే ఈ ప్రతిపాదనపై ప్రభుత్వం, ప్రయివేటు కంపెనీలు కలిసి ఆలోచించాలన్నారు. శనివారం నానీ పాల్కీవాలా స్మారకోపన్యాస కార్యక్రమంలో వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ఆయన మాట్లాడారు. ఈ సమయంలో బ్యాడ్ బ్యాంకు ప్రతిపాదనను పరిశీలించేందుకు తాము సిద్ధమన్నారు. 2020 సెప్టెంబర్ నాటికి 7.5 శాతంగా ఉన్న ఎన్పీఏలు 2021 సెప్టెంబర్ నాటికి 13.5 శాతానికి పెరిగే అవకాశాలు ఉన్నట్లు ఆర్బీఐ నివేదిక పేర్కొంది.

అవసరమైతే మరిన్ని చర్యలు
దేశ ఆర్థిక స్థిరత్వానికి మరిన్ని చర్యలు తీసుకోవడంలో రాజీపడేది లేదని దాస్ అన్నారు. కరోనా వ్యాప్తి కారణంగా ఏర్పడిన గడ్డు పరిస్థితులతో దేశ ఆర్థిక వృద్ధి మందగించిందని, ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నట్లు తెలిపారు. ఇటు ఆర్బీఐ, అటు కేంద్రం చర్యలవల్ల వేగవంతంగా కోలుకుంటున్నట్లు తెలిపారు. ఆర్థిక వ్యవస్థపై రాజీ పడబోమన్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో మరిన్ని చర్యలు తీసుకుంటామన్నారు.

విదేశీ మారకపు నిల్వలు పెంచుకోవాలి
జాతీయ చెల్లింపుల వేదిక కోసం ఆధునిక వ్యవస్థ ఏర్పాటుతో పాటు సురక్షితమైన, సమర్థవంతమైన, చవగ్గా సేవలందించే సమగ్ర చెల్లింపుల వ్యవస్థ కోసం ఆర్బీఐ ఇప్పటికే పలు విధానపరమైన చర్యలు చేపట్టిందని తెలిపారు. ఆర్బీఐ నియంత్రిత సంస్థలు తమవంతు చర్యలు చేపట్టాలని, ముప్పును ముందుగానే గుర్తించి, సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు అంతర్గత రక్షణ వ్యవస్థను పటిష్టం చేసుకోవాలన్నారు. అలాగే, భారత్‌లోకి విదేశీ మారక ప్రవాహం పెరగడం సాధారణమేనని, ఇవి పెంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు.