RBI Monetary Policy: వడ్డీ రేట్లు స్థిరంగా ఉంచిన ఆర్బీఐ
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) ద్రవ్య పరపతి విధాన కమిటీ(MPC) ద్వైమాసిక పాలసీ సమీక్ష బుధవారం ఆగస్ట్ 4వ తేదీన ప్రారంభమై, మూడు రోజుల పాటు జరిగింది. నేడు నేడు (శుక్రవారం, ఆగస్ట్ 6) ముగిసింది. ఈ సమావేశం అనంతరం MPC తీసుకున్న నిర్ణయాలకు సంబంధించిన వివరాలను ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ మీడియాకు వివరించారు. ఆయన ఉదయం పది గంటలకు వర్చువల్ సమావేశం ద్వారా MPC నిర్ణయాలను వెల్లడించారు. శక్తికాంత దాస్ నేతృత్వంలో ఆరుగురు సభ్యుల సమావేశం జరిగింది. వడ్డీ రేటు, జీడీపీ వృద్ధి రేటు అంచనాలు, ద్రవ్యోల్భణం వంటి అంశాలపై MPC పలు నిర్ణయాలు తీసుకుంది.
MPC నిర్ణయాలను శక్తికాంత దాస్ వెల్లడించారు. రెపో రేటును నాలుగు శాతంతో స్థిరంగా కొనసాగిస్తున్నట్లు తెలిపారు. బ్యాంకులకు ఇచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు, రెపో రేటును యథాతథంగా కొనసాగించే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు భావించినట్లుగానే ఆర్బీఐ స్థిరంగా ఉంచింది. ఆర్బీఐ వరుసగా ఏడుసార్లు వడ్డీ రేటును యథాతథంగా కొనసాగించింది.

కరోనా నేపథ్యంలో ఫైనాన్షియల్, ఆర్థిక వ్యవస్థల పురోగతికి సరళతర విధానాలు అవలంభించాల్సిన అవసరం ఉండటం, ద్రవ్యోల్భణం కట్టడి అవుతోందనే అంచనాల నేపథ్యంలో కీలకమైన రెపో రేటును అలాగే కొనసాగించవచ్చునని విశ్లేషకులు భావించారు. మార్చి 2020 తర్వాత కరోనా కారణంగా ఆర్బీఐ 115 బేసిస్ పాయింట్లు తగ్గించింది. ప్రస్తుతం రెపో రేటు 4 శాతం కాగా, రివర్స్ రెపో రేటు 3.35 శాతంగా ఉంది. ఇక, FY22లో ద్రవ్యోల్భణం ఔట్లుక్ గతంలో 5.1 శాతం అంచనా వేయగా, దీనిని సవరించే అవకాశాలు ఉన్నాయని నిపుణులు భావించారు.