స్థూల ఎన్పీఏలు 13.5 శాతానికి పెరగవచ్చు, బ్యాలెన్స్ షీట్లపై కరోనా దెబ్బ
2021 సెప్టెంబర్ నాటికి బ్యాంకుల స్థూల నిరర్థక ఆస్తులు (GNPA) 13.5 శాతానికి చేరుకోవచ్చునని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) ద్వైవార్షిక ఆర్థిక స్థిరత్వ నివేదిక (FSR)లో అంచనా వేసింది. ఇది ఇరవై రెండేళ్ల గరిష్టస్థాయి. 1998-99లో ఇది 14.7 శాతంగా ఉంది. 2020 సెప్టెంబర్ నాటికి 7.5 శాతానికి తగ్గాయి. ఒకవేళ స్థూల ఆర్థిక వాతావరణం దారుణంగా మారి, తీవ్ర ఒత్తిడిలోకి వెళ్తే నిరర్థక ఆస్తుల నిష్పత్తి 14.8 శాతానికి చేరుకోవచ్చునని నివేదిక తెలిపింది. 1997 మార్చి చివరి నాటికి ఇది 15.7 శాతంగా నమోదయింది. ఆ తర్వాత ఇదే అత్యధికం.
Budget 2021-22: ఈ ఏడాది బడ్జెట్ పత్రాల్లేవు! ఎందుకంటే

ఇలా పెరగవచ్చు
కమర్షియల్ బ్యాంకుల మొండి బకాయిలు మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని ఆర్బీఐ ఆందోళన వ్యక్తం చేసింది. గత ఏడాది సెప్టెంబర్ చివరి నాటికి బ్యాంకుల మొత్తం రుణాల్లో 7.5 శాతంగా ఉన్న స్థూల నిరర్థక ఆస్తులు ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి 22 ఏళ్ల గరిష్టం 13.5 శాతానికి చేరుకోవచ్చని ఈ నివేదికలో అంచనా వేసింది. స్థూల ఆర్థిక పరిస్థితి మరింత దిగజారితే జీఎన్‌పీఏ నిష్పత్తి 14.8 శాతానికి 24ఏళ్ల గరిష్టాన్ని తాకవచ్చునని నివేదిక పేర్కొంది.
2020 సెప్టెంబర్ చివరి నాటికి 9.7 శాతంగా ఉన్న ప్రభుత్వ రంగ బ్యాంకుల జీఎన్‌పీఏ నిష్పత్తి ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి కనీసం 16.2 శాతానికి, ప్రయివేటు రంగ బ్యాంకుల జీఎన్‌పీఏ నిష్పత్తి 4.6 శాతం నుంచి కనీసం 7.9 శాతానికి, విదేశీ బ్యాంకుల జీఎన్‌పీఏ నిష్పత్తి 2.5 శాతం నుంచి కనీసం 5.4 శాతానికి చేరుకోవచ్చని తెలిపింది. తీవ్ర ఒత్తిడి ఉంటే జీఎన్‌పీఏ ప్రభుత్వరంగ బ్యాంకుల్లో 17.6 శాతం, ప్రయివేటురంగ బ్యాంకు 8.8 శాతం, విదేశీ బ్యాంకుల్లో 6.5 శాతానికి పెరిగినా పెరగవచ్చునని తెలిపింది.

ఆర్థిక వ్యవస్థ పుంజుకోవాలి
కరోనా కారణంగా బ్యాంకుల బ్యాలెన్స్ షీట్లు బలహీనంగా మారవచ్చునని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ అన్నారు. బ్యాంకులకు మూలధన కొరత ఏర్పడే అవకాశం ఉందని ఈ నివేదికలో ఆయన పేర్కొన్నారు. నియంత్రణ పరమైన ఊరటను వెనక్కి తీసుకుంటే ఈ బలహీనతలు, మూలధన కొరతలు మరింత ఎక్కువగా కనిపించవచ్చునని తెలిపారు. బ్యాంకుల మూలధనాన్ని పెంచుకోవాలని, ప్రత్యామ్నాయ వ్యాపార నమూనాలతో సవాళ్లను ఎదుర్కోవాలని, ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడానికి మద్దతివ్వాలన్నారు.

భవిష్యత్తులో ఉపయోగం
ద్రవ్యపరమైన, రుణ వితరణకు సంబంధించిన నిబంధనలను సరళతరం చేయడం బ్యాంకుల ఆర్థిక పారామితులకు దన్నుగా నిలిచిందని, కానీ ఇప్పుడు అందుబాటులో ఉన్న గణాంకాలు బ్యాంకులపై ఉన్న ఒత్తిడిని వాస్తవికరీతిలో ప్రతిబింబించడం లేదన్నారు. ప్రస్తుత పరిస్థితులను అందిపుచ్చుకొని మూలధన అవసరాలను అధిగమించేందుకు, వ్యాపార విధానాలను మార్చుకునేందుకు బ్యాంకులు కృషి చేయాలన్నారు. ఇది భవిష్యత్తులో వాటికి ఎంతో ఉపయోగపడుతుందన్నారు.