రద్దుల చిట్టాలో మరో బ్యాంక్: లైసెన్స్‌ను క్యాన్సిల్ చేసిన ఆర్బీఐ
ముంబై: తమిళనాడుకు చెందిన లక్ష్మీ విలాస్ బ్యాంక్ విలీన ప్రక్రియ కొనసాగుతోండగానే.. మరో కో ఆపరేటివ్ బ్యాంక్ మాయం కాబోతోంది. మహారాష్ట్రకు చెందిన కరద్ జనతా సహకారి బ్యాంక్ రద్దుల జాబితాలో చేరింది. ఈ బ్యాంక్ లైసెన్స్ రద్దయింది. ఈ మేరకు భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఓ ప్రకటన జారీ చేసింది. బ్యాంక్ రద్దు చేసినప్పటికీ.. డిపాజిటర్లు కోరుకుంటే.. దాన్ని మళ్లీ పునరుద్ధరించే అంశాన్ని పరిశీలిస్తామని పేర్కొంది.
మహారాష్ట్రలోని కరద్ పట్టణం ప్రధాన కేంద్రంగా ఈ బ్యాంక్ కార్యకలాపాలను నిర్వహిస్తోంది. ఆ రాష్ట్ర కో ఆపరేషన్ అండ్ రిజిస్ట్రార్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీస్, ఆర్బీఐ రెగ్యులేటరీ యాక్ట్ కింద ఈ బ్యాంక్ రిజిస్టర్ అయింది. కొన్నేళ్లుగా తన కార్యకలాపాలను కొనసాగిస్తోంది. 2017 తరువాత బ్యాంక్‌కు సంక్షోభం చుట్టుముట్టింది. అప్పటి నుంచి కోలుకోలేకపోయింది. డిపాజిట్లు గణనీయంగా తగ్గాయి. కొత్తగా ఎలాంటి పెట్టుబడులు కూడా రాలేదు.

దీనితో ఈ బ్యాంకు దివాళా దశకు చేరుకుంది. రోజువారీ కార్యకలాపాలను కూడా నిర్వహించలేకపోతోంది. ఫలితంగా- ఈ బ్యాంక్ లైసెన్స్‌ను కోల్పోయింది. ఆర్థిక లావాదేవీలు, ఇతర వ్యాపార కార్యకలాపాలను కొనసాగించడానికి ఉద్దేశించిన లైసెన్స్‌ను రద్దు చేసినట్లు రిజర్వ్‌బ్యాంక్ వెల్లడించింది. డిపాజిట్ల సొమ్ము ఎక్కడికీ పోదని ఆర్బీఐ భరోసా ఇచ్చింది. 99 శాతం మేర డిపాజిట్లను వెనక్కి చెల్లిస్తామని స్పష్టం చేసింది. అయిదు లక్షల రూపాయల వరకు ఉన్న డిపాజిట్లన్నింటినీ వెనక్కి ఇస్తామని వివరించింది.
ఈ బ్యాంక్ కోసం లిక్విడేటర్‌ను అపాయింట్ చేయాలని ఆర్బీఐ మహారాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. ఈ మేరకు మహారాష్ట్ర కమిషనర్ ఆఫ్ కోఆపరేషన్ రిజిస్ట్రార్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీస్‌కు ఆదేశాలను జారీ చేసింది. డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ కింద ఖాతాదారులకు నగదు మొత్తాన్ని చెల్లిస్తామని పేర్కొంది. దీనిపై అయిదు లక్షల రూపాయల సీలింగ్‌ను నిర్ధారించింది. లిక్విడేషన్ ప్రొసీడింగ్స్, డిపాజిటర్లకు నగదు చెల్లింపులను వీలైనంత త్వరగా చేపట్టాలని పేర్కొంది.