పీఎఫ్ వడ్డీ రేటు, ఆరు కోట్లమంది ఉద్యోగులకు శుభవార్త!
2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (EPF) పైన వడ్డీ రేటును 8.5 శాతం ఇచ్చేందుకు కేంద్ర ఆర్థికమంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది. ఈ మేరకు శుక్రవారం వార్తలు వచ్చాయి. ఇందుకు సంబంధించి త్వరలో నోటిఫికేషన్ జారీ కానుంది. 2020-21 ఆర్థిక సంవత్సరానికి ఈపీఎఫ్‌పై 8.5 శాతం చొప్పున వడ్డీ జమ చేయాలని ఈ ఏడాది మార్చిలో EPFO నిర్ణయ మండలి కేంద్ర ధర్మకర్తల బోర్డు ప్రతిపాదించింది. ఇందుకు కార్మిక శాఖ సమ్మతించింది.
తాజాగా ఈ ప్రతిపాదనకు కేంద్ర ఆర్థిక శాఖ నుండి ఆమోదం లభించినట్లుగా చెబుతున్నారు. దీంతో 6 కోట్లకు పైగా ఈపీఎఫ్ సబ్స్క్రైబర్లకు ప్రయోజనం చేకూరుతుంది. వీరికి త్వరలో ఈ వడ్డీని జమ చేసే అవకాశాలున్నట్లు తెలిపాయి. ఇటీవలే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ కూడా చెప్పిన విషయం తెలిసిందే. డీఏ (డియర్నెస్ అలవెన్స్), డీఆర్ (డియర్నెస్ రిలీఫ్)ను 3 శాతం పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. దీంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు 31 శాతం అదనపు ప్రయోజనం దక్కుతుంది. ఇది జూలై 1, 202 నుండి అమలులోకి వచ్చింది.

గత ఆర్థిక సంవత్సరానికి PF పైన 8.5 శాతం వడ్డీరేటు ఏడేళ్లలో ఇదే కనిష్ఠం. 2018-19, 2016-17లో 8.65 శాతం చొప్పున వడ్డీ జమ చేశారు.
2013-14, 2014-15లో 8.75 శాతం చొప్పున ఇచ్చారు. 2015-16లో 8.8 శాతం జమ చేశారు. అయితే కరోనా నేపథ్యంలో గత ఏడాదిగా ఉపసంహరణలు పెరిగాయి. సబ్స్క్రైబర్ల నుండి జమ అయ్యే మొత్తం తగ్గింది. దీంతో 2019-20 ఆర్థిక సంవత్సరానికి ఈ వడ్డీని 8.5 శాతానికి తగ్గించారు. ఈసారి కూడా వడ్డీరేటును తగ్గించే అవకాశముందని వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఈ 8.5 శాతం వడ్డీకి కేంద్రం ఆమోదం తెలిపింది.