బ్యాంకుల్ని ప్రయివేటీకరించండి, డోర్లు తెరవాలి: మోడీ ప్రభుత్వానికి రఘురాం కీలక సూచనలు
ముంబై: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) మాజీ గవర్నర్ రఘురాం రాజన్ మరోసారి మోడీ ప్రభుత్వానికి కీలక సూచనలు చేశారు. దేశీయ బ్యాంకింగ్ వ్యవస్థ అనేక సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటోందని రఘురాం రాజన్‌తో పాటు మాజీ డిప్యూటీ గవర్నర్ విరల్ ఆచార్య అన్నారు. వీటిని కేంద్ర ప్రభుత్వం పరిష్కరించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వరంగంలోని కొన్ని బ్యాంకులను ప్రయివేటీకరించడంతో పాటు ఎన్పీఏ సమస్యను పరిష్కరించేందుకు బ్యాడ్ బ్యాంకును ఏర్పాటు చేయాలని సూచించారు. బ్యాంకుల పాలనా వ్యవహారాల్లో ప్రభుత్వ ప్రమేయాన్ని తగ్గించుకోవాలన్నారు.
అమెరికా కంపెనీతో వివాదానికి స్వస్తీ, డాక్టర్ రెడ్డీస్ ఒప్పందం: అందుకే స్టాక్స్ దూకుడు

ప్రయివేటీకరించాలి..
రఘురాం రాజన్, విరల్ ఆచార్యలు ఇండియన్ బ్యాంక్స్, ఎ టైమ్ టు రిఫామ్ అనే చర్చాపత్రంలో పలు సూచనలు చేశారు. ఎంపిక చేసిన ప్రభుత్వరంగ బ్యాంకులను ప్రయివేటీకరించాలని రఘురాం రాజన్ సూచించారు. ఆర్థికంగా, సాంకేతికంగా అనుభవం కలిగిన ప్రయివేటు పెట్టుబడిదారులను ఎంపిక చేసి, PSB బ్యాంకుల్లో వాటాల కోసం ఆహ్వానించాలన్నారు. కార్పోరేట్ కంపెనీలకు మాత్రం వాటిలో వాటాలు దక్కకుండా చూడాలన్నారు. కొన్ని ప్రభుత్వరంగ బ్యాంకుల్లో ప్రభుత్వం తన వాటాను యాభై శాతాని కంటే తక్కువకు తీసుకు రావడం ద్వారా బ్యాంకు కార్యకలాపాలకు, ప్రభుత్వానికి దూరం పెరిగి, పాలన మరింత మెరుగు అవుతుందన్నారు. బ్యాంకుల పాలనా వ్యవహారాల్లో ప్రభుత్వ ప్రమేయాన్ని తగ్గించుకోవాలన్నారు. పదేపదే మూలధన నిధులు సమకూర్చవలసిన అవసరం లేకుండా, బ్యాంకుల పాలనా వ్యవహారాలను, వాటి పనితీరును మెరుగుపరిచేందుకు ఈ సంస్కరణలు అవసరమన్నారు.

బ్యాడ్ బ్యాంకు.. సూచనలు
ఎన్పీఏ సమస్యను పరిష్కరించేందుకు బ్యాడ్ బ్యాంకును ఏర్పాటు చేయాలని రఘురాం రాజన్ సూచించారు. వివిధ బ్యాంకులకు చెందిన బ్యాడ్ లోన్లను టేకోవర్ చేసేలా బ్యాడ్ బ్యాంక్ అనివార్యమన్నారు. రుణదాతలకు, దివాలా తీసిన కంపెనీలకు మధ్య నిర్దేశిత కాలవ్యవధిలో చర్చలకు వీలు కల్పించి కోర్టు వెలుపల సమస్య పరిష్కారమయ్యేలా చూసేందుకు ఈ తగిన వ్యవస్థ అందుబాటులో ఉండాలన్నారు. అక్కడ సమస్య పరిష్కారం కాకపోతే నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్‌ను ఆశ్రయించే పరిస్థితి ఉండాలన్నారు. నిరర్థక ఆస్తుల అమ్మకం కోసం ఆన్లైన్ ప్లాట్‌ఫాంను అభివృద్ధి చేయడాన్ని ప్రభుత్వం పరిశీలించాలని, దీనికి తోడు బ్యాడ్ బ్యాంకులను ఏర్పాటు చేసి ఆన్లైన్ ప్లాట్‌ఫాంకు సమాంతరంగా ప్రోత్సహించాలన్నారు. అలాగే, బిజినెస్‌కు రుణాలు ఇచ్చే హోల్‌సేల్ బ్యాంకు ఉండాలని అభిప్రాయపడ్డారు.

ఆర్థిక సేవల విభాగం పాత్రను తగ్గించాలి
బ్యాంకు రుణాల విషయంలో ఆర్బీఐ నుండి అధికారాన్ని పొందిన ప్రభుత్వం, ఆ అధికారన్ని ఒక్కోసారి ప్రజాలక్ష్యాలను నెరవేర్చేందుకు, మరికొన్నిసార్లు ఆర్థిక సంఘటితానికి, మరోసారి పారిశ్రామికవేత్తలను నియంత్రణలోకి తెచ్చుకోవడానికి వినియోగించుకోవచ్చునని రాజన్ అన్నారు. ఆర్థిక శాఖలోని ఆర్థిక సేవల విభాగాన్ని తగ్గించుకుంటూ పోవాలన్నారు. తద్వారా బ్యాంకు బోర్డులు, యాజమాన్యానికి స్వాతంత్రం ఉంటుందన్నారు.

కొత్త బ్యాంకులు రావాలి..
నియంత్రణ, మార్కెట్ సంస్కరణలతో పాటు బ్యాంకు పాలన, యాజమాన్యం విషయంలోను సంస్కరణలు జరగాలన్నారు. బ్యాంకు లైసెన్స్ దరఖాస్తులను ఎప్పుడూ ఆహ్వానించాలని సూచించారు. అప్పుడే మెరుగైన బ్యాంకులు పుట్టుకు వస్తాయని చెప్పారు. మంచి ప్రదర్శన కనబరిచే చిన్న బ్యాంకులు పెద్ద బ్యాంకులుగా మారుతాయని, అదే సమయంలో పనితీరు లేని పెద్ద బ్యాంకులు చిన్న బ్యాంకులుగా మారిపోతాయన్నారు.