startup India seed fund: స్టార్టప్స్ కోసం రూ.1000 కోట్ల నిధి
న్యూఢిల్లీ: స్టార్టప్స్‌కు అండగా ఉండేందుకు వెయ్యికోట్ల రూపాయలతో ప్రధాని నరేంద్ర మోడీ స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్‌ను ప్రారంభించినట్లు ప్రకటించారు. వినూత్న ఆలోచనలను ఆవిష్కరణల రూపంలోకి తీసుకు వచ్చే విషయంలో యువ వ్యాపారవేత్తలకు ఈ నిధి ఉపయోగపడుతుందని తెలిపారు. స్టార్టప్స్ వృద్ధితో ఉద్యోగాల సృష్టి జరగడంతో పాటు ఆ ప్రాంతంలోని ప్రజల జీవన ప్రమాణాలు మెరుగు అవుతాయన్నారు.
స్టార్టప్స్, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు అండగా నిలిచేందుకు ఈ ఫండ్‌ను ప్రకటించారు. స్టార్టప్ ఇండియా ఇంటర్నేషనల్ సమ్మిట్‌ను ప్రారంభించిన సందర్భంగా ప్రధాని మాట్లాడారు. ఇన్నోవేటివ్ ఆలోచనలను ఆచరణలోకి తీసుకువచ్చేందుకు గాను ఈ ఫండ్ ఎంతగానో తోడ్పడుతుందన్నారు. స్టార్టప్స్ వృద్ధి పథంలో సాగితే ఉద్యోగాల కల్పనతో పాటు ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచటంలో కీలకంగా ఉంటారని ప్రధాని విశ్వాసం వ్యక్తం చేశారు.

దేశవ్యాప్తంగా ఉన్న స్టార్టప్స్ ఎలాంటి నిధుల కొరతను ఎదుర్కోకుండా ఉండేందుకు తాము కట్టుబడి ఉన్నామని, అందుకు తగినట్లుగా పలు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా స్టార్టప్స్ కోసం ఈ నిధులు కేటాయిస్తున్నట్లు తెలిపారు. కొత్త స్టార్ట్‌ప్సను ఏర్పాటు చేయటం సహా వాటి వృద్ధికి ఈ ఫండ్ అవసరమైన తోడ్పాటును అందిస్తుందన్నారు. ఇప్పటికే స్టార్టప్స్ తమకు అవసరమైన నిధులను సమీకరించేందుకు ఫండ్స్ ఆఫ్ ఫండ్స్ ఎంతగానో ఉపయోగపడుతున్నాయన్నారు.