ఢిల్లీలో రికార్డ్ గరిష్టానికి పెట్రోల్ ధరలు, వివిధ నగరాల్లో ధరలు...
ముంబై: పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరిగాయి. దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్ ధర ఆల్ టైమ్ గరిష్టాన్ని తాకింది. 20 రోజుల్లో చమురు ధరలు మూడోసారి పెరిగాయి. నేడు (జనవరి 22, శుక్రవారం) లీటర్ పెట్రోల్ ధర రూ.85.45కి చేరుకుంది. నిన్న ఈ ధర రూ.85.20గా ఉంది. లీటర్ డీజిల్ రూ.75.63 పలికింది. పెట్రోల్, డీజిల్ ధరలను లీటర్ పైన 25 పైసలు పెంచాయి చమురు రంగ సంస్థలు. అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా చమురు రంగ కంపెనీలు ధరలను ప్రతి రోజు ఉదయం ఆరు గంటలకు సవరిస్తాయి.

వివిధ నగరాల్లో ధరలు
పెట్రోల్ ధరలు లీటర్ ఢిల్లీలో రూ.85.45 నుండి రూ.85.20కు పెరిగింది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో రూ.92 కంటే పైకి చేరుకుంది. కోల్కతాలో రూ.86.87, చెన్నైలో రూ.88.16, బెంగళూరులో రూ.88.33, హైదరాబాద్లో రూ.88.16గా ఉంది. డీజిల్ ధర లీటర్ ఢిల్లీలో రూ.75.63, ముంబైలో రూ.82.40, హైదరాబాద్లో రూ.882.53గా ఉంది. అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా దేశీయంగా చమురు సంస్థలు రోజువారీ ధరలను సవరిస్తాయి. అయితే ఆయా రాష్ట్రాల్లోని సేల్స్ ట్యాక్స్, వ్యాట్ ఆధారంగా ధరల్లో మార్పులు ఉంటాయి.

ఎక్సైజ్ డ్యూటీ
పెట్రోల్, డీజిల్ ధరల పైన ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఎక్సైజ్ డ్యూటీ 48 శాతం పెరిగింది. ఏప్రిల్-నవంబర్ 2020 కాలంలో ఎక్సైజ్ డ్యూటీ వసూళ్లు ఏడాది ప్రాతిపదికన రూ.1,32,899 (2019) నుండి రూ.1,96,342 (2020) కోట్లకు పెరిగాయి. కరోనా కారణంగా చమురు ఉత్పత్తిని ఓపెక్ సహా ఇతర దేశాలు తగ్గించాయని దీంతో ధరలు పెరుగుతున్నాయని కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు.

అంతర్జాతీయ మార్కెట్లో...
అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ బ్యారెల్కు 55.65 డాలర్ల వద్ద పలికింది. 45 సెంట్లు లేదా 0.8 శాతం తగ్గింది. వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియేట్ 47 సెంట్లు లేదా 0.9 శాతం పడిపోయి 52.66 డాలర్లు పలికింది. దేశంలో ధరలు ఎక్కువగా ఉండేందుకు ప్రధాన కారణం, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ట్యాక్సులు. అధిక ట్యాక్స్ కారణంగా వినియోగదారులపై భారం పడుతోంది.