రెండేళ్ల గరిష్టానికి పెట్రోల్, డీజిల్ ధరలు: ఏ నగరంలో ఎంతంటే
ఢిల్లీ: పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్నాయి. చమురు రంగ కంపెనీలు (OMCs) ఆదివారం రిటైల్ ఫ్యూయల్ ధరలను పెంచాయి. దేశ రాజధాని ఢిల్లీలో నిన్న లీటర్ పెట్రోల్ పైన 28 పైసలు పెరిగి రూ.83.4 పైసలు, లీటర్ డీజిల్ పైన 29 పైసలు పెరిగి రూ.73.6గా ఉంది. ఈ పెరుగుదలతో పెట్రోల్ ధర ఢిల్లీలో అక్టోబర్ 4, 2018న ఆల్ టైమ్ గరిష్టం రూ.84 కంటే కేవలం 60 పైసలు మాత్రమే తక్కువగా ఉంది. దేశ రాజధానిలో రూ.84 దాటితే అదో కొత్త రికార్డ్.
RBI సెక్యూరిటీ రూల్స్! జనవరి నుండి పిన్ లేకుండా రూ.5,000 వరకు ట్రాన్సాక్షన్స్

ఆయా నగరాల్లో ఆల్ టైమ్ గరిష్టానికి దగ్గరగా..
దాదాపు దేశంలోని అన్ని నగరాల్లో పెట్రోల్ ధరలు ఆల్ టైమ్ గరిష్టానికి చేరుకున్నాయి. దేశ ఆర్థిక రాజధాని ముంబై నగరంలో పెట్రోల్ ధరలు అక్టోబర్ 4, 2018న రూ.91.3తో రికార్డు గరిష్టాన్ని తాకాయి. ఇప్పుడు ఇక్కడ రూ.90 వద్ద ఉంది. మరో రూ.1కి పైగా పెరిగితే ఇక్కడ కూడా ఆల్ టైమ్ గరిష్టాన్ని తాకుతుంది. చెన్నైలో, కోల్కతా నగరాల్లో వరుసగా రూ.87.3, రూ.85.8 రికార్డు గరిష్టం కాగా, ప్రస్తుతం ఈ నగరాల్లో సమీపానికి వచ్చాయి. చెన్నైలో 86.2, కోల్కతాలో 84.9గా ఉంది.

అక్టోబర్ 2018లో ఆల్ టైమ్ హై..
పెట్రోల్, డీజిల్ ధరలు గత పదిహేను రోజులుగా పెరుగుతున్నాయి. కరోనా కేసులు తగ్గడం, రికవరీలు పెరగడం, ఆర్థిక కార్యకలాపాలు వేగవంతం కావడంతో చమురు డిమాండ్ పెరుగుతుందనే అంచనాలు ఉన్నాయి. దీంతో గత కొద్ది రోజులుగా ధరలు పెరుగుతున్నాయి. దీనికి తోడు దేశీయంగా చమురు ధరలు ఆల్ టైమ్ గరిష్టానికి చేరుకున్నాయి. అక్టోబర్ 2018తో పోలిస్తే అంతర్జాతీయంగా బ్యారెల్ చమురు ధరలు 30 డాలర్లు తక్కువగా ఉంది. అదే సమయంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఆల్ టైమ్ హైకి చేరాయి.

నేటి ధరలు ఇలా..
గత నెల రోజుల్లో చమురు ధరలు బ్యారెల్కు 10 డాలర్లు పెరిగింది. దీంతో 50 డాలర్ల సమీపానికి చేరింది. నిన్న పెట్రోల ధరలు 28 పైసలు పెరగగా, డీజిల్ ధరలు 29 పైసలు పెరిగాయి. ఢిల్లీలో డీజిల్ ధర 73.32 నుండి 73.61కి పెరిగింది. పెట్రోల్ ధరలు నిన్న వరుసగా 5వ రోజు పెరిగాయి. అలాగే, నవంబర్ 20వ తేదీ తర్వాత 14వ పెరుగుదల.
నేడు (సోమవారం, 7 డిసెంబర్) పెట్రోల్ ధరలు 30-33 పైసల మధ్య పెరిగాయి. డీజిల్ ధరలు 25-31 పైసల మధ్య పెరిగాయి. దీంతో ఢిల్లీలో పెట్రోల్ రూ.83.71, ముంబైలో రూ.90.34, కోల్కతాలో రూ.90.34, చెన్నైలో రూ.86.51కు చేరుకున్నాయి. పెట్రోల్ ధర గత 17 రోజుల్లో రూ.2.65, డీజిల్ రూ.3.40 పెరిగింది.