రూ.20 లక్షలు దాటితే పాన్ లేదా ఆధార్ తప్పనిసరి, ఎప్పటి నుండి అంటే?
ఒక ఆర్థిక సంవత్సరంలో బ్యాంకులు, పోస్టాఫీసుల నుండి రూ.20 లక్షలకు మించి డిపాజిట్ చేసినా, ఉపసంహరించినా పాన్ కార్డు నెంబర్ లేదా ఆధార్ నెంబర్‌ను తప్పనిసరిగా కోట్ చేయాలని సీబీడీటీ వెల్లడించింది. బ్యాంకుల వద్ద కరెంట్ ఖాతా లేదా క్యాష్ క్రెడిట్ ఖాతా ప్రారంభించేందుకు కూడా వీటిని కోట్ చేయడం తప్పనిసరి చేశారు. ఈ మేరకు తాజాగా సీబీడీటీ ఒక నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. కొత్త నిబంధనలు 2022 మే 26వ తేదీ నుండి అమల్లోకి వస్తాయని వెల్లడించింది.
ఇప్పటి వరకు ఆయా ట్రాన్సాక్షన్స్ నిర్వహించే వ్యక్తి పాన్ నెంబర్ ఉందా లేదా అనే విషయం మాత్రమే బ్యాంకు అధికారి చూడవలసి వచ్చేదని, ఇక నుండి బ్యాంకు రికార్డుల్లో ఆ పాన్‌ను బ్యాంకు అధికారి మెన్షన్ చేయాలని, ఆదాయపు పన్ను శాఖకు ఆర్థిక ట్రాన్సాక్షన్స్ వివరాలను తెలియజేయవలసి ఉంటుందని చెబుతున్నారు.

ఈ కొత్త నిబంధనలు బ్యాంకులో మాత్రమే కాకుండా పోస్టాఫీస్, సహకార సంఘాలకు కూడా వర్తిస్తాయని చెబుతున్నారు. ఆర్థిక వ్యవస్థలో నగదు చెలామణిని అదుపు చేసి, నగదు డిపాజిట్ లేదా ఉపసంహరణను ట్రాక్ చేసే దిశగా కొత్త నిబంధనలు తీసుకు వచ్చిందని చెప్పారు. పాన్ నెంబర్ లేదా ఆధార్‌ను కోట్ చేయడంతో ఆయా ట్రాన్సాక్షన్స్‌కు టీడీఎస్ వర్తించినా లేకపోయినా అలాంటి వ్యక్తుల ఆర్థిక ట్రాన్సాక్షన్స్‌ను ఐటీ శాఖ ట్రాక్ చేసే వెసులుబాటు ఉంటుంది. రూల్ 114బీ ప్రకారం ఇప్పటికే ఒకరోజులో రూ.50,000కు మించి నగదును డిపాజిట్ చేస్తే పాన్ తప్పనిసరి. కానీ ఇప్పటి వరకు వార్షిక పరిమితి లేదు. ఇప్పుడు ఈ వార్షిక పరిమితిని విధించారు.