అవసరమైతే మరోసారి.. లేదనడం లేదు: ప్యాకేజీపై నిర్మల సీతారామన్ సంకేతాలు
అవసరమైతే మరో ఆర్థిక ప్యాకేజీ ప్రకటించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ సంకేతాలు ఇచ్చారు. కరోనా మహమ్మారి కారణంగా క్షీణించిన ఆర్థికవ్యవస్థకు ఊతమిచ్చేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. 15వ ఆర్థిక కమిషన్ చైర్మన్ ఎన్కే సింగ్ రాసిన పుస్తక ఆవిష్కరణ సభ సందర్భంగా మరో ఆర్థిక ప్యాకేజీ సంకేతాలు ఇచ్చారు నిర్మల. 2020-21 ఆర్థిక సంవత్సరంపై కరోనా తీవ్ర ప్రభావం నేపథ్యంలో కొత్తగా వృద్ధి, బడ్జెట్ ఎస్టిమేషన్‌తో వస్తామన్నారు.
ప్రపంచ దేశాల్లో అదుర్స్, అందుకే వేగంగా పుంజుకుంటోన్న చైనా

మరో ప్యాకేజీపై సంకేతాలు
'మరో ఉద్దీపన ప్యాకేజీ లేదని చెప్పడం లేదు' అని నిర్మలా సీతారామన్ అన్నారు. తాము ఉద్దీపన ప్యాకేజీ ప్రకటించిన ప్రతిసారి ఎన్నో విధాలుగా చర్చలు జరిపి, నిర్దిష్ట వర్గాల వారికి ప్రయోజనం కలిగేలా చూస్తున్నామన్నారు. అవసరమైతే కనుక మరో ఉద్దీపన ప్యాకేజీకి తలుపులు తెరిచే ఉన్నాయన్నారు. ప్రభుత్వం రూ.21 లక్షల కోట్ల ప్యాకేజీని లాక్ డౌన్ సమయంలో ప్రకటించారు. ఎంఎస్ఎంఈలు, ఉద్యోగులు, చిన్న వ్యాపారులు సహా వివిధ వర్గాల వారికి ప్రయోజనం కలిగేలా ప్రకటన చేశారు. ఇటీవల ప్రభుత్వ ఉద్యోగులకు రెండు వరాలు ఇచ్చి వ్యవస్థలో డిమాండ్ పెంచేదిశగా చర్యలు చేపట్టారు.

ఆర్థిక వ్యవస్థ, జీడీపీ మీద మదింపు
ఆర్థిక వ్యవస్థ, బడ్జెట్ నెంబర్స్‌కు సంబంధించి ఇప్పుడు అంచనాలు ప్రారంభమయ్యాయని నిర్మల అన్నారు. ఆర్థిక వ్యవస్థ, జీడీపీ మీద కరోనా ప్రభావాన్ని మదింపు చేస్తున్నామన్నారు. జూలై నెలకు భిన్నంగా ఇప్పుడు ఇన్పుట్స్ వస్తున్నాయన్నారు. తాము ఎప్పుడైనా ఓ ప్రకటనతో ముందుకు రావొచ్చునని, పార్లమెంటు సాక్షిగా ప్రకటిస్తామా లేదా మీడియా సమావేశంలో చెబుతామా అనేది నిర్ణయించుకోవాలన్నారు.

బడ్జెట్ పైన కసరత్తు
2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బడ్జెట్‌పై కసరత్తును ప్రారంభించారు. కరోనా నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సవరించిన అంచనాలతో కసరత్తు చేస్తున్నారు. కరోనా నేపథ్యంలో ప్రపంచ దేశాలతో పాటు భారత ఆర్థిక వ్యవస్థ కుప్పకూలింది. వచ్చే బడ్జెట్‌ను ప్రవేశ పెట్టడానికి ముందు ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన జీడీపీ నెంబర్స్‌ను సమర్పిస్తుందో లేదో చూడాలంటున్నారు. కాగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం భారత జీడీపీ మైనస్ 9.5 శాతం నమోదు కావొచ్చునని అంచనాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో మరో ఉద్దీపన ప్యాకేజీ సంకేతాలు ఇవ్వడం గమనార్హం.