అమెరికా ఎన్నికల ఉత్కంఠ: చమురు ధరలు జంప్, బంగారం డౌన్
అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు హోరాహోరీగా ఉన్నాయి. డెమోక్రటిక్ అభ్యర్థి జోబిడెన్ చేతిలో రిపబ్లికన్ డొనాల్డ్ ట్రంప్‌కు ఘోర పరాభవం తప్పదని భావించిన చాలామంది అంచనాలు తలకిందులయ్యాయి. కీలక రాష్ట్రాల్లో ట్రంప్ విజయం సాధించారు. దీంతో ఫలితాలు రసవత్తరంగా మారాయి. చాలా ఈజీగా బిడెన్ అధ్యక్షుడు అవుతాడని భావించిన వారికి ఫలితాలు షాకిచ్చేలా ఉన్నాయి.
ఫలితాలు ఉత్కంఠను కలిగిస్తున్నాయి. అధ్యక్షుడిగా గెలిచేందుకు 270 ఎలక్టోరల్ ఓట్లు అవసరం. బిడెన్ 225, ట్రంప్ 213 గెలుచుకున్నారు. లెక్కింపు కొనసాగుతోంది. అయితే తొలుత బిడెన్ గెలుపు సునాయాసంగా ఉంటుందని ఫలితాల సరళిని బట్టి భావించారు. అమెరికా ఎన్నికల ప్రభావం బంగారం, చమురు మార్కెట్ పైన కనిపించింది.
ఆర్థిక వ్యవస్థ అద్భుతం.. అమెరికా ఎకానమీని డొనాల్డ్ ట్రంప్ నిలబెట్టారు

చమురు పైకి, బంగారం కిందకు
అమెరికా ఎన్నికల ఫలితాల ప్రభావం చమురు, బంగారంపై కనిపించింది. ప్రారంభ సెషన్లో చమురు ధరలు ఎగిసిపడగా, పసిడి ధరలు పడిపోయాయి. న్యూయార్క్ మార్కెట్లో చమురు 1.9 శాతం లాభపడింది. స్పాట్ గోల్డ్ 0.3 శాతం క్షీణించింది. సిక్స్ బాస్కెట్ కరెన్సీలో డాలర్ వ్యాల్యూ పెరిగింది. డొనాల్డ్ ట్రంప్, జోబిడెన్ గెలుపుపై ఉత్కంఠ కొనసాగుతుండటంతో ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరిస్తున్నారు.

ఎగిసిపడిన క్రూడాయిల్ ధర
వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియేట్ డిసెంబర్ డెలివరీ 1.9 శాతం ఎగిసి బ్యారెల్ ధర 38.37 డాలర్లు పలికింది. బ్రెంట్ జనవరి సెటిల్మెంట్ ధర 1.6 శాతం పెరిగి బ్యారెల్ 40.36 డాలర్లు పలికింది. ఇక స్పాట్ గోల్డ్ 0.3 శాతం క్షీణించి ఔన్స్ 1,904.12 డాలర్లు పలికింది. కాపర్ టన్నుకు 0.5 శాతం క్షీణించి 6,780 పలికింది. సోయాబీన్ ధరల్లో స్వల్ప మార్పు చోటు చేసుకుంది. అయితే ఆ తర్వాత క్రూడాయిల్ ధరలు క్షీణించాయి. వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియేట్, బ్రెంట్ క్రూడ్, ఒపెక్ బాస్కెట్, ఇండియన్ బాస్కెట్ సహా కీలక క్రూడాయిల్స్ ధరలు తగ్గాయి. బంగారం ధరలు అంతర్జాతీయ మార్కెట్లో క్షీణించాయి. ఔన్స్ పసిడి 1 శాతం మేర పడిపోయి 1890 డాలర్లు పలికింది.

అమెరికా, ఆసియా మార్కెట్లు లాభాల్లో
అమెరికా ఎన్నికల నేపథ్యంలో ఆసియా, ప్రపంచ మార్కెట్ల దృష్టి అటువైపు ఉంది. అధ్యక్ష ఎన్నికల ఉత్కంఠ పరిస్థితుల్లో డౌజోన్స్ 2 శాతం, ఎస్ అండ్ పీ 1.75 శాతం, నాస్డాక్ 1.85 శాతం లాభపడ్డాయి. ఆసియా మార్కెట్లు కూడా లాభాల్లోనే ఉన్నాయ. నిక్కీ, స్ట్రెయిట్ టైమ్స్, తైవాన్ వెయిటెడ్, కోస్పి, షాంఘై కాంపోజిట్ లాభాల్లో ఉన్నాయి. హాంగ్‌షెంగ్, సెట్ కాంపోసిట్, జకర్తా కాంపోజిట్ నష్టాల్లో ఉన్నాయి. భారత మార్కెట్లు స్వల్ప లాభాల్లో ఉన్నాయి. మధ్యాహ్న గం.1.30 సమయానికి సెన్సెక్స్ 80 పాయింట్ల లాభంలో ఉంది.