ఐటీ రిటర్న్స్ గడువు పెంపు లేదు, రేపటి నుండి పాదరక్షలపై జీఎస్టీ పెంపు
ఆదాయపు పన్ను గడువును పెంచే యోచన లేదని కేంద్ర ఆర్థికమంత్రి మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. తమకు అలాంటి ప్రతిపాదన రాలేదని కేంద్ర రెవెన్యూ శాఖ కార్యదర్శి తరుణ్ బజాజ్ చెప్పారు. ప్రస్తుతం ఐటీఆర్ దాఖలు ప్రక్రియ సజావుగా సాగుతోందన్నారు. మధ్యాహ్నం గం. 3 సమయానికి 5.62 కోట్ల రిటర్న్స్ దాఖలయ్యాయని, నేడు ఒక్కరోజు 20 లక్షల మంది రిటర్న్స్ సమర్పించినట్లు తెలిపారు. ఈ ఏడాది 60 లక్షల అదనపు రిటర్న్స్ దాఖలయ్యే అవకాశముందన్నారు.
ఐటీ రిటర్న్స్ దాఖలుకు నేటితో గడువు ముగియనున్నది. దీంతో మరోసారి పెంపుకు అవకాశాలు ఉన్నాయని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దీంతో కేంద్ర ఆర్థికమంత్రిత్వ శాఖ దీనిపై వివరణ ఇచ్చింది. ఈ రోజు కేంద్ర జీఎస్టీ మండలి సమావేశం జరిగింది. కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఆధ్వర్యంలో జరిగిన భేటీ అనంతరం, వారు మీడియాతో మాట్లాడారు.

అదే సమయంలో చేనేత, జౌళిపై జీఎస్టీని 5 శాతం నుండి 12 శాతానికి పెంచాలనే నిర్ణయాన్ని తాత్కాలికంగా వాయిదా వేసినట్లు తెలిపారు. ఈ విషయమై మరింత లోతైన సమీక్ష జరిపేందుకు పన్ను రేట్ల హేతుబద్దీకరణ కమిటీకి పంపినట్లు తెలిపారు. ఫిబ్రవరి నాటికి ఈ అంశానికి సంబంధించి నివేదిక వస్తుందన్నారు. పాదరక్షలపై జీఎస్టీ పెంపును రేపటి నుండి అమలు చేయనున్నట్లు తెలిపారు.