Loan Moratorium: దరఖాస్తు అవసరంలేదు, వారికీ ప్రయోజనం.. వడ్డీ మాఫీపై మరో ఊరట!
ఢిల్లీ: కరోనా మహమ్మారి సమయంలో లోన్ మారటోరియంకు సంబంధించి కేంద్ర ఆర్థికమంత్రిత్వ శాఖ రుణగ్రహీతలకు మరో ఊరటనిచ్చే ప్రకటన చేసింది. మార్చి నుండి ఆగస్ట్ నెల వరకు ఆరు నెలల కాలంలో వడ్డీపై వడ్డీని మాఫీ చేస్తామని, దానిని తామే భరిస్తామని కేంద్ర ప్రభుత్వం సుప్రీం కోర్టుకు తెలిపింది. తాజాగా ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని ఆర్థికమంత్రిత్వ శాఖ మరో గుడ్న్యూస్ చెప్పింది. కరోనా కాలంలో లాక్ డౌన్, ఆర్థిక కార్యకలాపాలు నిలిచిపోవడంతో మారటోరియం వెసులుబాటును కల్పించిన విషయం తెలిసిందే.
లోన్ మారటోరియం గుడ్న్యూస్: ఎవరు అర్హులు, ఎంత లబ్ధి? EMI చెల్లించిన వారికి ప్రయోజనం ఎంత?

దరఖాస్తు అవసరంలేదు..
లోన్ మారటోరియం వ్యవధిలో రుణాలపై వడ్డీ మీద వడ్డీ మాఫీపై (చక్రవడ్డీ) కేంద్ర ఆర్థికశాఖ వివరణ ఇచ్చింది. సాధారణవడ్డీ, చక్రవడ్డీకి మధ్య వ్యత్యాసాన్ని రుణగ్రహీతల ఖాతాల్లో బ్యాంకులు జమచేసే అంశంపై స్పందించింది. ఎక్స్గ్రేషియా లెక్కింపునకు ఫిబ్రవరి 29వ తేదీ నాటికి కలిగి ఉన్న అసలు మొత్తాన్ని పరిగణనలోకి తీసుకోనున్నారు. రూ.2 కోట్ల దాకా MSME, స్టడీ లోన్, హోమ్ లోన్, వెహికిల్ లోన్, పర్సనల్ లోన్, క్రెడిట్ కార్డు బకాయిలు మొదలైన వాటికి ఈ స్కీం వర్తిస్తుంది. నిబంధనల మేరకు ఫిబ్రవరి 29 నాటికి మొండి బకాయిలుగా ఉండరాదు. మార్చి 1 నుంచి ఆగస్ట్ 21వ తేదీ కాలానికి (184 రోజులు) రీఫండ్ చేయనున్నారని తెలుస్తోంది. మారటోరియం ఎంచుకున్న వారికి, ఎంచుకోని వారికి, పాక్షికంగా ఉపయోగించుకున్న వారికి కూడా ఎక్స్గ్రేషియాను కేంద్ర ప్రభుత్వం చెల్లిస్తుంది. ఇందుకోసం ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు. నవంబర్ 5 కల్లా రుణగ్రహీతల ఖాతాల్లో ఎక్స్గ్రేషియాను జమ చేయాలని బ్యాంకులను ఆర్బీఐ ఆదేశించింది కూడా. బ్యాంకులు రుణగ్రహీతలకు జమ చేస్తే, ఆ తర్వాత కేంద్రం రీయింబర్స్ చేస్తుంది.

ప్రభుత్వం వివరణ
లోన్ మారటోరియంకు సంబంధించి వడ్డీ మినహాయింపు పథకం నుండి రుణగ్రహీతలు ప్రయోజనం ఎలా పొందుతారు, వడ్డీ మినహాయింపు ఎలా పని చేస్తుందనే అంశానికి సంబంధించి ప్రభుత్వం వివరణాత్మక ప్రకటన ఇచ్చింది. అర్హత, దరఖాస్తు, స్కీం కాలపరిమితి, చక్ర వడ్డీ మాఫీ వడ్డీ రేటు వంటి వాటికి అందులో స్పష్టత ఇచ్చింది.

మారటోరియం ఉపయోగించుకోని వారికీ ఈ ప్రయోజనం
ఎంఎస్ఎంఈ లోన్, విద్యా లోన్, ఇంటి కోసం రుణం, కన్స్యూమర్ డ్యూరబుల్ రుణాలు, క్రెడిట్ కార్డ్ డ్యూస్, ఆటోమొబైల్ లోన్, వ్యక్తిగత లోన్, కన్సంప్షన్ లోన్ తీసుకున్న వారు అర్హులని తెలిపింది. రూ.2 కోట్ల లోపు రుణాలు తీసుకున్న వారికి వర్తిస్తుంది. రూ.2 కోట్లకు పైగా తీసుకున్నవారు ఈ స్కీంకు అర్హులుకాదు. మారటోరియం వినియోగించుకోని వారికి కూడా వడ్డీ మాఫీ పథకం ప్రయోజనం వర్తిస్తుంది.
ప్రభుత్వరంగ, ప్రైవేటురంగ బ్యాంకులు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు, హౌసింగ్ ఫైనాన్స్ సంస్థలు, సహకార బ్యాంకులు, గ్రామీణ బ్యాంకుల నుండి రుణాలు తీసుకున్న వారు అందరూ అర్హులే.
మార్చి 1వ తేదీ నుండి ఇది వర్తిస్తుంది. నవంబర్ 5వ తేదీలోపు బ్యాంకులు రుణగ్రహీతలకు ఈ ప్రయోజనాన్ని అందించాలి.

సాధారణ వడ్డీ.. చక్రవడ్డీ
విద్య, హౌసింగ్, ఆటోమొబైల్, పర్సనల్ లోన్, ప్రొఫెషనల్స్, కన్సంప్షన్ లోన్ల పైన సాధారణ, చక్రవడ్డీ మధ్య వ్యత్యాసాన్ని లెక్కించడానికి వడ్డీ రేటు రుణ ఒప్పందంలో పేర్కొన్న విధంగా ఉంటుంది. కన్స్యూమర్ డ్యూరబుల్ లోన్స్ పైన కూడా లోన్ అగ్రిమెంట్ ప్రకారం ఉంటుంది. ఇక, ఈఎంఐలపై వడ్డీని వసూలు చేయని కేసుల్లో (నో కాస్ట్ ఈఎంఐ) రుణదాత బేస్ రేటు లేదా ఎంసీఎల్ఆర్ ఆధారంగా ఎక్స్గ్రేషియా ఉంటుంది.