ఈ ఏడాది నిఫ్టీకి ఇదే సెకండ్ బిగ్గెస్ట్ గెయిన్, రూ.5 లక్షల కోట్ల సంపద పెరిగింది
భారత స్టాక్ మార్కెట్ ఈ సంవత్సరంలోనే రెండో అతిపెద్ద లాభాన్ని నేడు (మే 20, 2022) నమోదు చేసింది. అంతర్జాతీయ పరిణామాలు, అమెరికా, యూరోపియన్ మార్కెట్ సానుకూల సంకేతాలు వంటి వివిధ అంశాలు జత కలవడంతో సూచీలు దాదాపు మూడు శాతం మేర లాభపడ్డాయి. సెన్సెక్స్ సరిగ్గా 2.91 శాతం లాభపడి 54,326 పాయింట్లు, నిఫ్టీ 2.89 శాతం లాభపడి 16,266 పాయింట్ల వద్ద ముగిశాయి. గత ఆరు సెషన్లలో ఇదే భారీ లాభం.
ఇక మార్కెట్లు నేడు భారీగా లాభపడటంతో ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈ మార్కెట్ క్యాప్ కూడా భారీగా పెరిగింది. సెన్సెక్స్ 1534 పాయింట్లు ఎగిసిపడింది. దీంతో బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాప్ రూ.5 లక్షల కోట్లకు పైగా పెరిగి రూ.2,54,78,435.64 కోట్లకు చేరుకుంది.

మార్కెట్ క్యాప్ పరంగా టాప్ టెన్ కంపెనీల విషయానికి వస్తే రిలయన్స్ ఇండస్ట్రీస్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, HDFC బ్యాంకు, ఇన్ఫోసిస్, హిందూస్తాన్ యూనీలీవర్, లైఫ్ ఇన్సురెన్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా, ఐసీఐసీఐ, ఎస్బీఐ, HDFC, భారతీ ఎయిర్టెల్ ఉన్నాయి.