జూన్ నుండి థర్డ్ పార్టీ బీమా పెంపు, ఏ వాహనంపై ఎంత అంటే?
టూవీలర్స్, ఫోర్ వీలర్స్‌కు ఇకపై బీమా ఖర్చులు మరింత పెరుగుతున్నాయి. వెహికిల్ థర్డ్ పార్టీ మోటార్స్ ఇన్సురెన్స్‌ను పెంచుతూ సంబంధిత మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకున్నది. ఇది జూన్ 1వ తేదీ నుండి అమలులోకి వస్తోంది. ఈ మేరకు బుధవారం నోటిఫికేషన్ జారీ చేసింది. రెండేళ్ల తర్వాత థర్డ్ పార్టీ బీమా ప్రీమియంను ప్రభుత్వం పెంచింది. కరోనా మహమ్మారి కారణంగా గత రెండేళ్లుగా దీనిపై మారటోరియం విధించారు.
నోటిఫికేషన్ ప్రకారం సవరించిన థర్డ్ పార్టీ బీమా ప్రీమియం ధరలు ఇలా ఉన్నాయి. 1000 సీసీ ఇంజిన్ సామర్థ్యం కలిగిన ప్రయివేటు కార్ల ప్రీమియంను రూ.2072 నుండి రూ.2094కు, 1000 సీసీ నుండి 1500 సీసీ వరకు ఇంజిన్ సామర్థ్యం కలిగిన ప్రయివేటు కార్ల బీమా ప్రీమియం రూ.3221 నుండి రూ.3416కు పెంచారు. కానీ 1500 సీసీ కంటే ఎక్కువ ఇంజిన్ సామర్థ్యం కలిగిన కార్ల ప్రీమియంను రూ.7897 నుండి రూ.7890కి తగ్గించారు.

150 సీసీ నుండి 350 సీసీ వరకు ఉండే బైక్స్ బీమా ప్రీమియం ఇక నుండి రూ.1366కు పెరుగుతుంది. 350 సీసీ కంటే అధిక సామర్థ్యం కలిగిన బైక్స్ ప్రీమియం రూ.2804కు, 30 కిలో వాట్ల కంటే తక్కువ ఉండే ఎలక్ట్రిక్ కార్ల ప్రీమియం రూ.178, 30 నుండి 65 కిలో వాట్ల మధ్య ఉండే విద్యుత్ కార్ల ప్రీమయం రూ.2904కు చేరుకుంది.
1200 కిలోల నుండి 20 వేల కిలోల సామర్థ్యం కలిగిన కమర్షియల్ వెహికిల్స్ థర్డ్ పార్టీ బీమా ప్రీమియం రూ.33,414 నుండి రూ.35,313కు, 40వేల కిలోల కంటే అధిక సామర్థ్యం కలిగిన కమర్షియల్ వెహికిల్ ప్రీమియం రూ.41,561 నుండి రూ.44,242కు పెరిగింది. స్కూల్స్ వినియోగించే బస్సుల ప్రీమియంపై 15 శాతం డిస్కౌంట్, హైబ్రీడ్ ఎలక్ట్రిక్ వాహనాలపై రూ.7.5 శాతం డిస్కౌంట్ ఇవ్వనున్నట్లు తెలిపారు.