మ్యూచువల్ ఫండ్స్ మురిపిస్తున్నాయ్..పెట్టుబడులు పెరుగుతున్నాయ్..
ప్రస్తుతం మన దేశంలో 44 మ్యూచువల్ ఫండ్ కంపెనీలు ఉన్నాయి. ఈ కంపెనీల మొత్తం ఆస్తులు అక్టోబర్ నెల చివరి నాటికీ సెప్టెంబర్ నెల (24.5 లక్షల కోట్లు) తో పోల్చితే 7.4 శాతం పెరిగి 26.33 లక్షల కోట్లకు చేరుకున్నాయి. ఇందుకు ప్రధానంగా ఈక్విటీ, లిక్విడ్ పథకాలు దన్నుగా నిలిచాయి.
* సెప్టెంబర్ నెలలో మ్యూచువల్ ఫండ్స్ నుంచి ఇన్వెస్టర్లు 1.52 లక్షల కోట్లు వెనక్కి తీసుకున్నారు. అయితే ఒక్క నెలలోనే ఇన్వెస్టర్ల ధోరణి మారిపోయింది. అందుకే అక్టోబర్ నెలలో ఇన్వెస్టర్ల పెట్టుబడులు 1.33 లక్షల కోట్లు పెరిగాయి.
* ఈ మొత్తం పెట్టుబడుల్లో లిక్విడ్ ఫండ్స్ లోకి 93,200 కోట్లు వచ్చాయి. రిటైల్ ఇన్వెస్టర్ల మూలంగానే ఈ పెట్టుబడులు వచ్చినట్టు ఫండ్ మేనేజర్స్ చెబుతున్నారు. ఈక్విటీ, లిక్విడ్ పథకాల్లోకి పెట్టుబడులు ఎక్కువగా పెరిగాయి.
* ఓపెన్ ఎండెడ్ ఈక్విటీ స్కీమ్స్ లోకి 6,026 కోట్ల పెట్టుబడులు వచ్చాయి.

* క్లోజ్ ఎండెడ్ ఈక్విటీ ప్లాన్లలోకి 11 కోట్లు మాత్రమే వచ్చాయి. మొత్తంగా గత నెలలో ఈక్విటీల్లోకి 6,015 కోట్ల పెట్టుబడులు వచ్చాయి.
* సెప్టెంబర్ లో ఈ పథకాల్లోకి నికరంగా వచ్చిన పెట్టుబడులు 6,489 కోట్లుగా ఉన్నాయి.
* పెట్టుబడుల రాక సానుకూల ఇన్వెస్ట్మెంట్ ట్రెండ్ ను సూచిస్తోందని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు.
ప్రభుత్వ చర్యలతో...
దేశ ఆర్థిక వ్యవస్థలో వృద్ధిని పెంచడానికి ప్రభుత్వం కొంతకాలంగా పలు రకాల చర్యలు తీసుకుంటోంది. ఈ నేపథ్యంలో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ మెరుగుపడుతోంది. దీని ఫలితంగా స్టాక్ మార్కెట్లు జోరుగా పెరుగుతున్నాయి. ఇన్వెస్టర్లలో విశ్వాసం పెరిగి మళ్ళీ పెట్టుబడులు పెరగడం మొదలయింది.
సిప్ లకు గిరాకీ
* ఇన్వెస్టర్లు క్రమానుగత పెట్టుబడి ప్లాన్ (సిప్) ల ద్వారా పెట్టుబడులు పెంచుకుంటున్నారు. డెట్ ఆధారిత పథకాలు, లిక్విడ్ ఫండ్స్‌లో ట్రెజరీ బిల్స్, సర్టిఫికెట్స్ అఫ్ డిపాజిట్, కమెర్షియల్ పేపర్ వంటి వాటిలో గత నెలలో 93,203 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. అంతకు ముందు సెప్టెంబర్ నెలలో 1.4 లక్షల కోట్ల పెట్టుబడులు తరలి పోయాయి.
* సిప్ ల ద్వారా మ్యూచువల్ ఫండ్స్ లోకి అక్టోబర్ లో 8,246 కోట్లు వచ్చాయి. సెప్టెంబర్ నెలలో ఈ పెట్టుబడులు 8,263 కోట్లుగా ఉన్నాయి.
* మొదటిసారిగా సిప్ ల నిర్వహణలోని ఆస్తులు 3 లక్షల కోట్లు దాటాయి. సిప్ ఖాతాలు కూడా పెరిగాయి.
* డెట్ ఫండ్స్ లోకి 1.2 లక్షల కోట్లు రాగా..రెండు నెలల నుండి గోల్డ్ ఎక్స్చేంజి ట్రేడెడ్ ఫండ్స్ లో పెట్టుబడులు పెరుగుతున్నాయి. అయితే అక్టోబర్‌లో మాత్రం 31.45 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. సెప్టెంబర్ లో 44 కోట్లు, ఆగస్టులో 145 కోట్లు వచ్చాయి.
ఈటీఎఫ్ ల జోరు
* ఎక్స్చేంజి ట్రేడెడ్ ఫండ్స్ (ఈటీఎఫ్) పై ఇన్వెస్టర్లకు ఆసక్తి పెరుగుతోంది. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజి లో ఈటీఎఫ్ ల ఆస్తులు సెప్టెంబర్ తో ముగిసిన ఆరు నెలల్లో 9 శాతం పెరిగి 1.5 లక్షల కోట్లకు చేరుకున్నాయి. సెప్టెంబర్ చివరి నాటికీ ఈక్విటీ, డెట్ సూచీలకు సంభందించి 71 ఈటీఎఫ్ లున్నాయి. ఈ ఏడాది మార్చి నెలలో వీటి సంఖ్య 66గా ఉంది.
* ఈ ఏడాది మార్చి చివరి నాటికీ ఈటీఎఫ్ ఆస్తులు 72,888 కోట్లుగా ఉన్నాయి.