టెస్లా కార్లు: ఎలాన్ మస్క్ వివాదాస్పద ట్వీట్, భారత్ ధీటు స్పందన
భారత్‌లోకి టెస్లా కార్ల ప్రవేశంపై ఆ సంస్థ అధినేత ఎలాన్ మస్క్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇవి వివాదానికి దారి తీశాయి. ప్రభుత్వంతో ఎదురవుతున్న సవాళ్ల కారణంగా టెస్లా భారత్ రాక ఆలస్యమవుతోందని ఎలాన్ మస్క్ సామాజిక అనుసంధాన వేదిక ట్విట్టర్ ద్వారా ఆరోపించారు. ఈ ఆరోపణలను ప్రభుత్వం ఖండించింది. సోషల్ మీడియా ద్వారా మస్క్ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడింది.

మస్క్ వివాదాస్పద ట్వీట్
భారత్‌లోకి టెస్లా కార్ల విడుదలపై ఓ నెటిజన్ ట్విట్టర్ ద్వారా మస్క్‌ను ప్రశ్నించారు. టెస్లా విడుదల పైన అప్ డేట్ ఉందా, ఈ కార్లు చాలా బావుంటాయని, ప్రపంచంలోని ప్రతిచోట వీటిని విడుదల చేయాలని పేర్కొన్నారు. దీనిపై మస్క్ స్పందించారు. ప్రభుత్వంతో సవాళ్లు ఉన్నాయని, దీనిపై ఇప్పటికే ప్రయత్నాలు చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ ట్వీట్‌కు అనుకూలంగా, అననుకూలంగా పెద్ద ఎత్తున ట్వీట్లు వచ్చాయి. ఇది వివాదం కావడంతో భారత ప్రభుత్వం స్పందించింది.

ప్రభుత్వం ఘాటు స్పందన
సోషల్ మీడియ్ వేదికగా ఎలాన్ మస్క్ భారత్ పైన ఒత్తిడి తెచ్చే ప్రయత్నాలు చేస్తున్నారని ప్రభుత్వ వర్గాలు వెల్లడించినట్లుగా మీడియాలో వార్తలు వచ్చాయి. ఇలాంటి ట్రిక్స్‌కు ప్రభుత్వం ఎన్నడూ తలొగ్గదని పేర్కొన్నాయి. దేశంలో టెస్లా కార్లను తయారు చేసే అంశంపై ఎలాంటి హామీ ఇవ్వకుండానే దిగుమతి సుంకాలను తగ్గించాలని డిమాండ్ చేస్తోందని, ఆటోమొబైల్ రంగానికి, ముఖ్యంగా ఎలక్ట్రిక్ వాహనాలకు భారత్ ప్రోత్సాహకాలు ఇస్తోందని, టెస్లా కనుక ఇక్కడే కార్లను తయారు చేస్తే ఎంతో లబ్ధి ఉంటుందని పేర్కొన్నాయి.

టెస్లాకు ప్రభుత్వం క్లియర్ మెసేజ్
టెస్లా కార్ల కోసం వేచి చూస్తున్న భారతీయులకు ఎలాన్ మస్క్ 2021 అక్టోబర్ నెలలో ధన్యవాదాలు తెలిపారు. 2021లో కచ్చితంగా లాంచ్ చేస్తామని వెల్లడించారు. అలా థ్యాంక్స్ చెప్పి పదిహేను నెలలు అవుతున్నప్పటికీ ఇంకా లాంచింగ్ ప్లాన్‌లోనే ఉంది. ఆ తర్వాత 2021లో మస్క్ 'ఇతర అతిపెద్ద దేశాలతో పోలిస్తే భారత్‌లో అత్యధిక పన్నులు ఉన్నాయి' అని పేర్కొన్నారు. ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించింది. పన్నులు 100 శాతం నుండి 40 శాతానికి తగ్గిస్తామని, కానీ టెస్లా కార్ల తయారీ భారత్‌లో ఉండాలని స్పష్టమైన సందేశాన్ని ఇచ్చింది. దీనిపై టెస్లా నుండి సరైన సమాధానం రాలేదని చెబుతున్నారు.