మైక్రోసాఫ్ట్ అంటే ఇష్టం, సర్వేలో ఇండియా కంపెనీలు మూడు: ఉద్యోగులు ఏం చెప్పారంటే?
ఢిల్లీ: హెచ్ఆర్ ఫర్మ్ నిర్వహించిన సర్వేలో దేశంలోనే అత్యంత ఆకర్షణీయ ఉద్యోగ సంస్థల్లో మైక్రోసాఫ్ట్ ఇండియా తొలి స్థానంలో నిలిచింది. శాంసంగ్ ఇండియా రెండు, అమెజాన్ ఇండియా రెండు, మూడో స్థానాల్లో నిలిచాయి. ఇన్ఫోసిస్ నాలుగో స్థానంలో నిలువగా, మెర్సిడెజ్ బెంజ్ ఐదవ స్థానంలో ఉంది. ఈ ఏడాది ర్యాండ్స్టడ్ ఎంప్లాయర్ బ్రాండ్ రీసెర్చ్ సర్వేలో ఈ విషయాలు వెల్లడయ్యాయి.
హైదరాబాద్‌లో భారీగా తగ్గిన హౌసింగ్ సేల్స్, ధరలు ఎలా ఉన్నాయంటే?

మైక్రోసాఫ్ట్ అంటే ఇష్టం.. అందుకే
ర్యాండ్స్టడ్ ఎంప్లాయర్ బ్రాండ్ రీసెర్చ్-2020 సర్వే ప్రకారం ఆర్థికంగా, పేరు ప్రఖ్యాతలు, సరికొత్త టెక్నాలజీల వినియోగంలో మైక్రోసాఫ్ట్ ఇండియా ముందు ఉంది. 33 దేశాల్లోని 6,136 సంస్థల్లో పని చేస్తోన్న 18 ఏళ్ల నుండి 65 ఏళ్ల మధ్య ఉన్న 1.85 లక్షలమంది అభిప్రాయాలతో ర్యాండ్స్టడ్ ఈ సర్వేను నిర్వహించింది. ఇందులో భాగంగా మన దేశంలోని ఉద్యోగుల్లో 43% మంది మైక్రోసాఫ్ట్‌కు అత్యధిక మార్కులు వేశారు. ఆధునాతన టెక్నాలజీలను సమర్థవేతంగా వినియోగించుకోవడం, బలమైన పేరుప్రతిష్టలు, ఆర్థిక పరిపుష్టి నేపథ్యంలో మైక్రోసాఫ్ట్ ఇండియాలో పని చేయాలని ఎక్కువమంది కోరుకున్నారు. వేతనం, ఉద్యోగ ప్రయోజనాల పట్ల ఆకర్షితులైనవారు 41%, ఉద్యోగ భద్రత కారణంగా 40% మంది మైక్రోసాఫ్ట్ పట్ల ఆసక్తి కనబరిచారు.

మన దేశానివి మూడు
ర్యాండ్స్టడ్ సర్వేలో టాప్ 10 ఆకర్షణీయ సంస్థల్లో భారత్ నుండి 3 కంపెనీలే ఉన్నాయి. ఐటీ సంస్థలు ఇన్ఫోసిస్, టీసీఎస్‌తో పాటు FMCG రంగం నుండి ఐటీసీ ఉన్నాయి. మొత్తం 10 సంస్థల్లో అమెరికాకు చెందినవి నాలుగు, జపాన్, జర్మనీ, దక్షిణ కొరియాలకు ఒక్కొక్కటి ఉన్నాయి.

దేశంలోని ఆకర్షణీయ సంస్థల్లో టాప్ 10
1.మైక్రోసాఫ్ట్, 2. శాంసంగ్, 3.అమెజాన్, 4.ఇన్ఫోసిస్ 5.మెర్సిడెజ్ బెంజ్, 6.సోనీ 7.ఐబీఎం, 8.డెల్ టెక్నాలజీస్, 9.ఐటీసీ గ్రూప్, 10.టీసీఎస్ టాప్ 10లో ఉన్నాయి.
రంగాల వారీగా చూస్తే.. ఐటీ, ఐటీ అనుబంధ రంగాలు, టెలికం, ఆటోమోటివ్ సంస్థల్లో పనిచేసేందుకు ఎక్కువమంది ఇండియన్ ఉద్యోగులు ఆసక్తి కనబరిచినట్లు ఈ సర్వేలో వెల్లడైంది. FMCG, రిటైల్, ఈ కామర్స్, బీఎఫ్ఎస్ఐ సంస్థలు ఆ తర్వాత స్థానంలో నిలిచాయి.

ఉద్యోగులు ఏం కోరుకుంటున్నారు
ఫోన్, కారు, పిల్లల సంరక్షణ సేవలు, సౌకర్యవంతమైన పనివేళలు వంటి సదుపాయాలు కల్పించే కంపెనీలకు 81 శాతం మంది ఉద్యోగులు ప్రాధాన్యత ఇస్తున్నారు.
మంచి శఇక్షణ అవకాశాలు కల్పించే ఉద్యోగ సంస్థల కోసం సెర్చ్ చేస్తున్నట్లు 18-24 ఏళ్ల వయస్సున్న వారు 38 శాతం మంది, సరికొత్త టెక్నాలజీ వినియోగానికి అవకాశమున్న కంపెనీలు కావాలని 25 నుండి 34 ఏళ్ల వయస్సు వారు 34 శాతం మంది వెల్లడించారు. పని ప్రదేశం తమకు సౌకర్యవంత దూరంలో ఉండాలని 55 నుండి 65 ఏళ్ల వయస్సు ఉన్నవారు 32 శాతం మంది చెప్పారు.