ఉద్యోగులకు ఈ కంపెనీల గుడ్న్యూస్, వేతనాల పెంపు..
కరోనా వైరస్ నేపథ్యంలో కంపెనీలు వేతనాలు పెంచడం కంపెనీలకు ఇబ్బందికరంగా మారింది. ఈ మహమ్మారి సమయంలోను కొన్ని కంపెనీలు శాలరీ పెంచాయి. ఇటీవలి కాలంలో ఆర్థిక కార్యకలాపాలు పెరగడంతో ఈ ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుండి శాలరీ పెంచని కంపెనీలు ఇప్పుడు ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెబుతున్నాయి. గత మూడు నెలలుగా ఆటో సేల్స్ పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో దీంతో ఇప్పుడు మారుతీ, హ్యుండాయ్, టీవీఎస్, హీరో మోటో కార్ప్, రాయల్ ఎన్ఫీల్డ్ తమ సంస్థలో పని చేసే ఉద్యోగులకు శాలరీ పెంచే ఆలోచన చేస్తున్నాయి.
పండుగ సమయంలో ఉద్యోగులకు అమెజాన్ ప్రత్యేక గుర్తింపు బోనస్l

మహీంద్రా అండ్ మహీంద్రా వేతనాల పెంపు
నివేదిక ప్రకారం భారతదేశపు అతిపెద్ద ట్రాక్టర్ తయారీ, యుటిలిటీ వాహన తయారీ కంపెనీ మహీంద్రా అండ్ మహీంద్రా డిసెంబర్ నుండి వేతనాల పెంపుకు సిద్ధమైందని తెలుస్తోంది. సాధారణంగా ఆటోమేకర్స్ ఆగస్ట్ 1న ఇంక్రిమెంట్స్ ప్రకటిస్తారు. ఈసారి కరోనా కారణంగా వేతనాల పెంపు ఆలస్యం అయింది. కరోనా లాక్ డౌన్, ఆటో సేల్స్ భారీగా పడిపోవడంతో ఉద్యోగాల కోత, వేతనాల కోత చోటు చేసుకుంది. ఇప్పుడు సేల్స్ క్రమంగా గాడిన పడుతుండటంతో ఉద్యోగాలు పెరగడంతో పాటు వేతనాల పెంపు వైపు అడుగులు వేస్తున్నారు. తమ కార్యకలాపాలు దాదాపు సాధారణ స్థితికి వచ్చాయని, ఏడాది ప్రాతిపదికన వృద్ధి పైన దృష్టి సారించామని, తమ కంపెనీ ఇంక్రిమెంట్ డిసెంబర్ నుండి అమలులోకి వస్తుందని మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు.

ఈ సంస్థలు కూడా
మారుతీ సుజుకీ, హ్యుండాయ్, హీరో మోటో కార్ప్, టీవీఎస్ మోటార్స్, రాయల్ ఎన్ఫీల్డ్, ఎంజీ మోటార్స్, కియా మోటార్స్,కూడా ఉద్యోగులకు వేతనాలు పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయి. అక్టోబర్, నవంబర్ నెలల్లో సేల్స్ క్రమంగా పెరుగుతుండటంతో ఇంక్రిమెంట్స్ పైన దృష్టి సారించారని తెలుస్తోంది. మారుతీ సుజుకీ అక్టోబర్ నెలలో ఉద్యోగులకు వేతన పెంపును ప్రకటించిందని తెలుస్తోంది. టూవీలర్ మేకర్ హీరో మోటో కార్ప్లో మెరిట్ ఆధారిత వేతనాల పెంపు ఉంది.

పెరిగిన సేల్స్
గత మూడు నెలలుగా పాసింజర్ వెహికిల్ సేల్స్ 17 శాతం మేర పెరిగాయి. దసరా, దీపావళి సందర్భంగా డిమాండ్ పెరిగి ఆటో సేల్స్ సానుకూలంగా ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో ఉద్యోగుల్లో ఆత్మస్థైర్యం నింపేందుకు కంపెనీలు మొగ్గు చూపాయి. గత రెండు నెలల్లో గ్రామీణ డిమాండ్, ఎంట్రీ లెవల్ ప్యాసింజర్ కార్లతో పాటు బైక్స్ పెరుగుదల రికవరీ ఊహించిన దాని కంటే ఎక్కువగా ఉంది. అయితే కొన్ని కంపెనీలు ఈ ఏడాది ఇంక్రిమెంట్ ఇవ్వకూడదని నిర్ణయించాయి.