ఐదు రోజుల లాభాలకు బ్రేక్, రూ.2.26 లక్షల కోట్ల సంపద కరిగిపోయింది
స్టాక్ మార్కెట్లు మంగళవారం(మార్చి 15) భారీ నష్టాల్లో ముగిశాయి. ఉదయం లాభాల్లో ప్రారంభమైన, ఆ తర్వాత మధ్యాహ్నం గం.12.30 వరకు భారీ ఊగిసలాటలో కనిపించినప్పటికీ, ఆ తర్వాత నుండి అంతకంతకూ నష్టాల్లోకి వెళ్లాయి. చివరకు 700 పాయింట్లకు పైగా నష్టాల్లో ముగిశాయి. అమెరికా ఫ్యూచర్, ఐరోపా మార్కెట్లు నష్టాల్లో పయనించడం దేశీయ మార్కెట్ ఇన్వెస్టర్ల సెంటిమెంటును దెబ్బతీసింది. దీనికి తోడు చైనాలో కొత్తగా కరోనా కేసులు విజృంభిస్తుండటం ఇన్వెస్టర్లకు ఆందోళన కలిగిస్తోంది.

700 పాయింట్లు డౌన్
సెన్సెక్స్ ఉదయం 56,663.87 పాయింట్ల వద్ద ప్రారంభమై, 56,720 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 55,418 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. నిఫ్టీ 16,900 పాయింట్ల వద్ద ప్రారంభమై, 16,927 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 16,555 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. సెన్సెక్స్ చివరకు 709 పాయింట్లు లేదా 1.26 శాతం క్షీణించి 55,776.85 పాయింట్ల వద్ద, నిఫ్టీ 208 పాయింట్లు లేదా 1.23 శాతం క్షీణించి 16,663 పాయింట్ల వద్ద ముగిసింది. నేటి నష్టాలతో ఐదు రోజుల లాభాలకు బ్రేక్ పడింది.

నష్టాలకు కారణాలివే
ఉక్రెయిన్ - రష్యా మధ్య యుద్ధ విరమణ దిశగా పురోగతి కనిపించకపోవడం ప్రపంచ, దేశీయ ఇన్వెస్టర్లపై ప్రభావం చూపింది. దీనికి తోడు రష్యా ఉత్పత్తులపై టారిఫ్ పెంచుతూ యూకే ఆంక్షలను మరింత కఠినతరం చేసింది. ఇక, గత ఐదు రోజులుగా మార్కెట్లు లాభాల్లో ఉండటంతో ప్రస్తుత అనిశ్చితుల కారణంగా ఇన్వెస్టర్లు ప్రాఫిట్ బుకింగ్‌కు సిద్ధపడ్డారు. చైనాలో మళ్లీ లాక్ డౌన్ ప్రభావం చూపాయి. డాలర్ మారకంతో రూపాయి 76.57 వద్ద ట్రేడ్ అయింది.

మార్కెట్ క్యాప్ డౌన్
సెన్సెక్స్ 30 స్టాక్స్‌లో 7 మినహా మిగతా అన్నీ నష్టాల్లోనే ముగిశాయి. 23 షేర్లు నష్టాల్లో ముగిశాయి. భారీగా నష్టపోయిన రంగాల్లో మెటల్ ఉంది. ఆటో మినహా అన్ని రంగాలు నష్టాల్లో ముగిశాయి. ఐటీ, మెటల్, పవర్, ఆయిల్ అండ్ గ్యాస్ సూచీలు 1 శాతం నుండి 4 శాతం చొప్పున నష్టపోయాయి. బీఎస్ఈ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు 0.5 శాతం చొప్పున నష్టపోయాయి. బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాప్ నేడు రూ.2.26 లక్షల కోట్లు క్షీణించి రూ.2.51 లక్షల కోట్లకు తగ్గింది.