వొడాఫోన్ ఐడియా, ఎయిర్‌టెల్‌లకు మోడీ ప్రభుత్వం భారీ ఊరట
న్యూఢిల్లీ: టెలికం సంస్థలకు కేంద్ర ప్రభుత్వం భారీ ఊరటను కల్పించింది. స్పెక్ట్రం చెల్లింపులపై రెండేళ్ల గడువు ఇవ్వడానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. పోటీ కారణంగా భారీ ఆర్థిక నష్టాలకు తోడు ఇటీవల సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో టెలికం సంస్థలు తీవ్ర ఇబ్బందుల్లో కూరుకుపోయాయి. వొడాఫోన్ ఐడియా వంటి సంస్థ అయితే ఏకంగా చేతులెత్తేసింది. ఇక పెట్టుబడులు పెట్టేది లేదని, ప్రభుత్వం సాయం చేయకుంటే మూసివేయాల్సిన పరిస్థితులేనని హెచ్చరించింది. ప్రభుత్వం సాయం చేయాలని వొడాఫోన్ ఐడియా, భారతీ ఎయిర్ టెల్ వంటి టెల్కోలు కోరాయి.
టెలికం కష్టాలు: అప్పుల్లో కూరుకుపోయి...
టెలికం సంస్థల అభ్యర్థనకు మోడీ ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. రెండేళ్ల పాటు స్పెక్ట్రం చెల్లింపులపై మారటోరియం కల్పిస్తూ ప్రధాని మోడీ అధ్యక్షతన కేబినెట్ సమావేశమై కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో 2020-21, 2021-22 ఆర్థిక సంవత్సరాలకుగాను స్పెక్ట్రం రుణాలపై మారటోరియం ఇచ్చినట్లు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్.. కేబినెట్ అనంతరం మీడియాతో చెప్పారు. దీంతో భారతీ ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా, రిలయన్స్ జియోలకు రూ.42 వేల కోట్ల రిలీఫ్ ప్యాకేజీ లభించినట్లయింది. టెలికం రంగ సంస్థలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడానికి ప్రత్యేక కమిటీని కూడా ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. కేంద్రం నిర్ణయాల పట్ల టెలికం ఆపరేటర్ల సంఘం హర్షం వ్యక్తం చేసింది.

అదే సమయంలో ప్రభుత్వరంగ సంస్థల్లో ప్రభుత్వ వాటాల విక్రయానికి వీలుగా కేంద్ర కేబినెట్ బుధవారం నిర్ణయం తీసుకుంది. భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (BPCL), షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (SCI), కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (concor) సహా అయిదు భారీ PSUల్లో ప్రభుత్వ పెట్టుబడుల వ్యూహాత్మక ఉపసంహరణకు కేబినెట్ ఆమోదం తెలిపింది.
ఈ సంస్థల్లో నిర్వహణాధికార బదిలీ కూడా ఉంటుందని చెప్పారు. బీపీసీఎల్ పోర్ట్ ఫోలియో నుంచి నుమలీగఢ్ రిఫైనరీని విడదీసిన తర్వాత బీపీసీఎల్‌లో ఉన్న 53.29% వాటాను ప్రభుత్వం విక్రయిస్తుందన్నారు. నుమలీగఢ్ రిఫైనరీ మరో ప్రభుత్వ రంగ సంస్థ చేతుల్లోకి వెళ్తుందని చెప్పారు.
యూపీ ప్రభుత్వంతో కలిసి నిర్వహిస్తున్న తెహ్రీ హైడ్రో డెవలప్మెంట్ కార్పొరేషన్ ఇండియా లిమిటెడ్‌లో వాటాను ప్రభుత్వం విక్రయిస్తుంది. నార్త్ ఈస్టర్న్ ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్‌లోని వాటాను విక్రయిస్తున్నట్లు తెలిపారు. అయితే ఈ రెండు సంస్థల్లోని ప్రభుత్వ వాటాల్ని మరో ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఎన్టీపీసీ కొనుగోలు చేయనుంది. SCIలో ప్రభుత్వానికి 63.75% వాటా ఉండగా, అందులో 53.75% వాటాను విక్రయించనున్నారు. కాంకర్లో 54.80% శాతం వాటా ఉండగా 30.90 శాతం వాటాను ఉపసంహరించుకోనున్నారు.