తెలంగాణలో మహీంద్ర రూ.100 కోట్ల భారీ పెట్టుబడి, K2 సిరీస్ ట్రాక్టర్ల ఉత్పత్తి
హైదరాబాద్: మహీంద్రా అండ్ మహీంద్రా (M&M) తెలంగాణలో భారీ పెట్టుబడులు పెట్టనుంది. ఈ సంస్థ ప్రతిష్టాత్మకంగా తీసుకు వస్తోన్న K2 సిరీస్ ట్రాక్టర్లను తెలంగాణలోని జహీరాబాద్ ప్లాంటులో తయారు చేయనుంది. మహీంద్రా ఈ నిర్ణయంతో 1500 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయి.
విస్తరణలో భాగంగా తెలంగాణలోని ఈ ప్లాంటులో కే2 సిరీస్ ట్రాక్టర్లను ఉత్పత్తి చేయనున్నట్లు కంపెనీ వెల్లడించింది. భారత్‌తో పాటు అమెరికా, జపాన్, ఆగ్నేయాసియా సహా ఇతర అంతర్జాతీయ మార్కెట్ల కోసం వివిధ హార్స్పవర్ శ్రేణిలో 37 మోడల్స్‌ను తీసుకురానున్నట్లు కంపెనీ తెలిపింది.
2021లో మొబైల్ ఛార్జీల మోత, భారీగా పెరగనున్న టారిఫ్! వీఐ బాటలో ఎయిర్టెల్

జహీరాబాద్‌లో విస్తరణ
సంగారెడ్డి జిల్లాలోని జహీరాబాద్‌లో ప్రస్తుతం ఉన్న ట్రాక్టర్ల తయారీ కేంద్రంలో రూ.100 కోట్ల పెట్టుబడితో దీనిని నెలకొల్పనున్నారు. 2012లో దేశంలోనే అతిపెద్ద ట్రాక్టర్ల పరిశ్రమను మహీంద్రా ఏర్పాటు చేసింది. 2024 నాటికి అందుబాటులోకి రానుంది. పదిహేను వందల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని సంస్థ తెలిపింది. తెలంగాణలో భారీ పెట్టుబడులకు మహీంద్రా ముందుకు రావడం పట్ల మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు.

ఏడాదికి లక్ష ట్రాక్టర్లు
జహీరాబాద్‌లోని ప్లాంటులో ప్రస్తుతం ప్రతి ఏడాది లక్ష ట్రాక్టర్లు ఉత్పత్తి అవుతున్నాయి. ప్రపంచంలోనే అత్యధిక ట్రాక్టర్ల ఉత్పత్తి సంస్థగా మహీంద్రా అండ్ మహీంద్రా గుర్తింపు సాధించింది. ఇప్పటికే ఉన్న ప్లాంటులో 1500 మంది పని చేస్తుండగా, 2024 నాటికి అంతే మంది జతకానున్నారు.
తమకు తెలంగాణ ప్రభుత్వం నుండి సహకారం, మద్దతు ఉందని మహీంద్ర ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ తెలిపారు. జహీరాబాద్‌లో మరికొంతమంది స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నారు.

మిత్సుబిషితో కలిసి
జపాన్ కంపెనీ మిత్సుబిషితో కలిసి మహీంద్రా అగ్రికల్చరల్ మిషినరీ, మహీంద్రా రిసెర్చ్ వ్యాలీ ఇంజినీరింగ్ బృందాల సహకారంతో K2 సిరీస్ ట్రాక్టర్లను అభివృద్ధి చేస్తున్నట్టు రెగ్యులేటరీ ఫైలింగ్‌లో మహీంద్రా తెలిపింది. మిత్సుబిషితో కలిసి పరిశోధనలు నిర్వహించి, తక్కువ బరువుగల K2 సిరీస్ ట్రాక్టర్లను తయారు చేయడంతో పాటు వివిధ HP సామర్థ్యం కలిగిన ముప్పై ఏడు రకాల మోడల్స్‌ను తయారు చేయనుంది.