HDFC బ్యాంకు-HDFC విలీనం: ఒకే వేదికపై.. కస్టమర్లకు ప్రయోజనం
దేశంలోని అతిపెద్ద గృహ రుణాల సంస్థ HDFC, దేశంలోని అతిపెద్ద ప్రయివేటు బ్యాంకు HDFC బ్యాంకులో విలీనం అవుతోంది. వీటి విలీనానికి ఏడాది నుండి ఏడాదిన్నర సమయం పట్టవచ్చు. ఈ రెండింటి విలీనంతో రెండు సంస్థలకు లాభమే. అతిపెద్ద ప్రయివేటు బ్యాంకు HDFC బ్యాంకు వద్ద భారీ మొత్తంలో డిపాజిట్లు ఉన్నాయి. కాబట్టి కస్టమర్లకు గృహ రుణాలు అందజేయడానికి పెద్దగా ఇబ్బంది ఉండదు. తక్కువ వడ్డీ రేటుతో లభించి కస్టమర్ల డిపాజిట్లను రుణాలు ఇచ్చేందుకు వినియోగించుకోవచ్చు. మోర్టగేజ్ సంస్థ HDFC వద్ద డిపాజిట్లు అంతగా లేవు. ఇతర మార్గాల ద్వారా నిదులను సమీకరించి వితరణ చేస్తోంది. ఇప్పుడు వీటి విలీనం ద్వారా తక్కువ ఖర్చుతో ఎక్కువ రుణాల అందజేతకు వీలవుతుంది. గతంతో పోలిస్తే తక్కువ వడ్డీకి రుణాలు అందించవచ్చు.

అతిపెద్ద విలీనం
HDFC, HDFC బ్యాంకు విలీనంతో భారత్లోనే ఇది అతిపెద్ద మూడో సంస్థగా నిలువవచ్చు. అవసరమైన రెగ్యులేటరీ ఆమోదాల అనంతరం FY24 రెండు లేదా మూడో త్రైమాసికానికి విలీన ప్రక్రియ పూర్తవుతుందని ఈ రెండు సంస్థలు భావిస్తున్నాయి. ఇప్పటి వరకు ప్రధానంగా నిర్వహణ నిర్మాణం, వ్యాపార ఏకీకరణ, రెండు వైపుల ప్రయోజనాలపై దృష్టి సారించారు. వడ్డీ రేట్లు, HDFC నుండి HDFC బ్యాంకుకు ఖాతాల బదలాయింపు వంటి వాటికి సంబంధించిన కార్యాచరణ వివరాలు అధికారికంగా ప్రకటించవలసి ఉంది.

అతి తక్కువ వడ్డీ రేటుకు హోమ్ లోన్స్
ఎన్బీఎఫ్సీ అయిన HDFC లిమిటెడ్ దేశంలో అతితక్కువ వడ్డీ రేటుకు హోమ్ లోన్స్ అందిస్తుంది. వడ్డీ రేట్లు 6.7 శాతం నుండి ప్రారంభమవుతున్నాయి. ఈ నేపథ్యంలో బ్యాంకులో విలీనం తర్వాత కూడా రేట్లలో పెద్దగా మార్పు ఉండదని అంటున్నారు. అయితే గరిష్ట పరిమితి మాత్రం కొద్దిగా దిగి రావొచ్చునని భావిస్తున్నారు. ఫలితంగా వడ్డీ రేట్ల విషయంలో కొత్త, పాత రుణగ్రహీతలకు పెద్దగా మార్పు ఉండదు. విలీనం తర్వాత కూడా టర్మ్, ఫిక్స్డ్ డిపాజిట్లు పునరుద్ధరించాలనుకున్నా లేదా కొత్తగా డిపాజిట్ చేయాలనుకున్నా అప్పుడు HDFC బ్యాంకు నియమ నిబంధనలు వర్తిస్తాయి.

రెండు కంపెనీల ఉత్పత్తులు
విలీనం తర్వాత HDFC లిమిటెడ్ కస్టమర్లకు HDFC బ్యాంకు ఉత్పత్తులన్నీ అందుబాటులోకి వస్తాయి. ఇరు సంస్థల యాజమాన్యాలు ఇటీవల తెలిపిన వివరాల ప్రకారం HDFCకి చెందిన 70 శాతం కస్టమర్లు HDFC బ్యాంకింగ్ సేవలను వినియోగించుకోవడం లేదు. అలాగే, HDFC బ్యాంకు వినియోగదారులలో 80 శాతం మంది HDFC హోమ్ లోన్స్ పొందడం లేదు. విలీనం తర్వాత ఇది ప్రయోజనకరంగా మారుతుంది. ఒకేవేదికపై రెండు కంపెనీల ఉత్పత్తులు అందుబాటులోకి వస్తాయి. విలీనం అమలు తర్వాత ఖాతా నెంబర్లు మారే అవకాశాలు లేకపోలేదు.