For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఇక మరింత ప్రొఫెషనల్‌గా ‘కార్వీ’.. త్వరలోనే గ్రూప్‌కు కొత్త సారథి!?

|

తన ఖాతాదారుల షేర్లను వివిధ బ్యాంకుల వద్ద తనఖా పెట్టి తీసుకున్న రుణాలను గ్రూపులోని కంపెనీలకు తరలించడంతోపాటు ఖాతాదారులకు చెల్లించాల్సిన నగదును చెల్లించడం లేదన్న కారణాలతో 'సెబీ' వేటు వేయడంతో అప్రతిష్ట మూటగట్టుకున్న కార్వీ స్టాక్ బ్రోకింగ్ లిమిటెడ్(కేఎస్‌బీఎల్) తనపై పడిన మచ్చను తొలగించుకునే ప్రయత్నాల్లో ఉన్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం పరిస్థితి నుంచి సంస్థను గట్టెక్కించేందుకు, ఇకపై మరింత ప్రొఫెషనల్‌గా కార్యకలాపాలు నిర్వహించేందుకు.. గ్రూప్ కంపెనీల బాధ్యతను ఓ ముఖ్య కార్యనిర్వహణ అధికారి(సీఈవో) స్వీకరించనున్నారని సమాచారం. దేశీయ ఫైనాన్షియల్ రంగంలో పేరున్న ప్రముఖ వ్యక్తిని ఇప్పటికే సీఈవోగా కార్వీ నియమించినట్లు, త్వరలోనే ఆయన బాధ్యతలు స్వీకరించనున్నట్లు తెలుస్తోంది.

కొత్త సీఈవో సారథ్యంలో...

కొత్త సీఈవో సారథ్యంలో...

ప్రస్తుత సంక్షోభం నుంచి కార్వీ స్టాక్ బ్రోకింగ్ సంస్థని గట్టెక్కించి.. గ్రూప్‌‌ను మళ్లీ పురోగతి పథంలో నడిపించేందుకు ఓ చక్కటి సీఈవో అవసరం ఉందని కార్వీ సీఎండీ పార్థసారథి భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓ సీఈవోను కూడా ఎంపిక చేశారని, గతంలో ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, రిలయన్స్‌, గోద్రెజ్‌ వంటి ప్రముఖ గ్రూపుల్లో పని చేసిన అత్యంత సమర్థుడైన ఆ వ్యక్తికి తాజాగా కంపెనీ బాధ్యతలు అప్పగించాలని పార్థసారథి నిర్ణయించారని తెలుస్తోంది. కార్వీ స్టాక్ బ్రోకింగ్‌ లిమిటెడ్‌తోపాటుగా గ్రూప్ కంపెనీలన్నీ ఆ సీఈవో చేతిలోనే పెట్టాలని ఆయన భావిస్తున్నట్లు సమాచారం.

 కొత్త సారథి ఎందుకంటే...

కొత్త సారథి ఎందుకంటే...

దాదాపు 95 మంది ఖాతాదారులకు చెందిన రూ.2,300 కోట్ల విలువైన షేర్లను తాకట్టు పెట్టి నిధులు సమీకరించి గ్రూప్‌ కంపెనీలకు తరలించిందన్న ఆరోపణలపై కార్వీ స్టాక్‌ బ్రోకింగ్‌ లైసెన్స్‌ను సెబీ సస్పెండ్‌ చేసింది. మరోవైపు కార్వీకి ఇచ్చిన రుణాలను వసూలు చేసుకోవడానికి బ్యాంకులు, ఆర్థిక సంస్థలు కసరత్తు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో వచ్చిన అపవాదును తొలగించుకోడానికి భిన్నమైన నాయకత్వం అవసరమని కార్వీ సీఎండీ పార్థసారథి భావిస్తున్నారు. ప్రస్తుతం ఎదుర్కొంటోన్న ఇబ్బందులను అధిగమించేందుకు, సంస్థను కష్టాల నుంచి బయట పడేసేందుకు సరికొత్త వ్యూహం, విధానం కూడా అవసరమని, ఈ కష్టాల్లో వయసు పైపడిన కార్వీ అధినేత పార్థసారథికి బలమైన అండ అవసరమన్న ఆలోచనతో కొత్త వ్యక్తికి గ్రూప్ నిర్వహణ పగ్గాలు అప్పగించనున్నట్లు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి.

కొత్త సీఈవో ముందు ఎన్నో సవాళ్లు...

కొత్త సీఈవో ముందు ఎన్నో సవాళ్లు...

మరోవైపు కార్వీ కొత్త సీఈవో ముందు ఎన్నో సవాళ్లు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఖాతాదారులకు, రుణదాతలకు చెల్లింపులు జరపాల్సి ఉంది. సెబీ, ఇతర నియంత్రణ సంస్థలకు సంస్థ మనుగడపై సంతృప్తి కలిగించి, నచ్చచెప్పి కార్వీ స్టాక్‌ బ్రోకింగ్‌ లైసెన్స్‌పై ఉన్న సస్పెన్షన్‌ను తొలగించాలి. చాలా కాలంగా కార్వీతో అనుబంధం ఉన్న చిన్న, పెద్ద ఖాతాదారుల్లో మళ్లీ విశ్వాసాన్ని నింపడం కూడా కొత్తగా పగ్గాలు చేపడుతున్న సీఈఓ ముందున్న ప్రధానాంశాలలో ఒకటిగా తెలుస్తోంది.

 పునర్‌ వ్యవస్థీకరణకు కసరత్తు...

పునర్‌ వ్యవస్థీకరణకు కసరత్తు...

కార్యకలాపాల నిర్వహణకు సరిపడా నిధులు సమకూర్చుకుని.. మళ్లీ స్టాక్ బ్రోకింగ్‌ కార్యకలాపాలను ప్రారంభించాలని కార్వీ సీఎండీ పార్థసారథి గట్టి ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తోంది. దీనికోసం బిజినెస్‌ మోడల్‌లో మార్పులు చేయాలని ఆయన నిర్ణయించినట్లు సమాచారం. నిధుల సమీకరణకు.. వాటా విక్రయం, రుణాలు, ఇతరత్రా మార్గాలను ప్రస్తుతం సంస్థ పరిశీలిస్తోంది. అవసరాన్ని, కంపెనీ ప్రయోజనాలను బట్టి ఏ ఏ మార్గంలో ముందుకెళ్లాలో నిర్ణయించనుంది.

నిధుల సమీకరణకు గట్టి ప్రయత్నాలు...

నిధుల సమీకరణకు గట్టి ప్రయత్నాలు...

కార్వీ డేటా మేనేజ్‌మెంట్‌ సర్వీసెస్‌ లిమిటెడ్‌ (కేడీఎంఎస్‌ఎల్‌)లో వాటా విక్రయం ద్వారా నిధులు సమకూర్చుకోవాలని కూడా సంస్థ యాజమాన్యం యోచిస్తోంది. తద్వారా రూ.500-1,000 కోట్లు సమీకరించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. మరోవైపు కార్వీకి అవసరమైన నిధులు అందించడానికి కొన్ని సంస్థలు కూడా ప్రతిపాదనలతో వస్తున్నాయని.. ఈ నేపథ్యంలో ఏది తమకు అత్యంత అనువైనదో కార్వీ పరిశీలిస్తున్నట్లు సమాచారం.

డీపీ ఖాతాల బదిలీ తక్కువే...

డీపీ ఖాతాల బదిలీ తక్కువే...

స్టాక్‌ మార్కెట్లలో జరిగే ప్రతి అయిదు లావాదేవీల్లో ఒకటి ‘కార్వీ' ద్వారానే జరుగుతోంది. ఈ సంస్థకు దాదాపు 15 లక్షల ఖాతాదారులున్నారు. వీరిలో 2.5-3 లక్షల మంది చురుగ్గా ట్రేడింగ్‌ చేసేవారే. అక్రమాల నేపథ్యంలో కార్వీ స్టాక్ బ్రోకింగ్ కార్యకలాపాలను మార్కెట్ల నియంత్రణ సంస్థ ‘సెబీ' ఇటీవల సస్పెండ్ చేయడంతో ట్రేడింగ్‌ ఖాతాలు ఇతర బ్రోకర్‌ సంస్థలకు బదిలీ అయిపోయాయి. అయితే డీపీ ఖాతాలను మాత్రం కార్వీ వద్దే ఉంచడానికి చాలా మంది ఇష్టపడుతున్నారని.. ట్రేడింగ్‌ ఖాతాలతో పోలిస్తే డీపీ ఖాతాల బదిలీ తక్కువగానే ఉందని చెబుతున్నారు.

ఉద్యోగులకు సీఎండీ భరోసా...

ఉద్యోగులకు సీఎండీ భరోసా...

కంపెనీలో ఇటీవలి పరిణామాలకు భయపడి ఉద్యోగాలు వదిలి వెళ్లిపోవాలనుకునే ఉద్యోగులకు కూడా కంపెనీ సీఎండీ పార్థసారథి స్వయంగా భరోసా ఇస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే కంపెనీ తిరిగి గాడిలో పడుతుందని, ఏడాదిలో మళ్లీ పరిస్థితులన్నీ చక్కబడతాయని ఆయన వారికి చెబుతున్నట్లు సమాచారం. మళ్లీ యథావిధిగా బ్రోకింగ్‌ వ్యాపారాన్ని కొనసాగించాలని కూడా ఆయన భావిస్తున్నట్లు చెబుతున్నారు.

అత్యవసర ఖాతాదారులకు చెల్లింపులు...

అత్యవసర ఖాతాదారులకు చెల్లింపులు...

వివాహం, వైద్య చికిత్స వంటి అత్యవసరాలున్న ఖాతాదారులకు ప్రాధాన్య ప్రాతిపదికన చెల్లింపులు చేస్తున్నట్లు చెబుతున్నారు. ఖాతాదారుల సమస్యల పరిష్కారం, చెల్లింపులపై దృష్టి పెడుతున్నట్లు, చెల్లింపులకు గ్రూప్‌ కంపెనీల నుంచి నిధులు సమకూర్చుకుంటున్నట్లు సమాచారం. వేచి ఉండగల పెద్ద ఖాతాదారులకు నచ్చజెప్పి కొద్ది మొత్తాల్లో కార్వీ వారికి చెల్లింపులు చేస్తోందని.. వీలైనంత మంది చిన్న మదుపర్లకు చెల్లింపులు చేయడానికి ప్రయత్నిస్తోందని సంబంధిత వర్గాలు వివరిస్తున్నాయి.

Read more about: sebi సెబీ
English summary

karvy will have it's new ceo soon

Karvy group Chairman and Managing Director C Parthasarathy thinking to appoint new CEO for his entire group very soon. According to sources, he already selected a suitable person for this post.
Story first published: Saturday, December 28, 2019, 20:59 [IST]
Company Search
Thousands of Goodreturn readers receive our evening newsletter.
Have you subscribed?
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Goodreturns sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Goodreturns website. However, you can change your cookie settings at any time. Learn more