ముగిసిన స్పెక్ట్రం వేలం, జియో టాప్: ఎయిర్టెల్, ఐడియా రెండు, మూడు స్థానాల్లో...
అయిదేళ్ల తర్వాత మళ్లీ ప్రారంభమైన స్పెక్ట్రం వేలం ముగిసింది. నిన్న (సోమవారం, మార్చి 1) ప్రారంభమైన స్పెక్ట్రం వేలం నేడు (మంగళవారం, 2వ తేదీ) ముగిసింది. మొత్తం రూ.77,814.80 కోట్ల విలువైన బిడ్స్ దాఖలయ్యాయి. అత్యధికంగా రిలయన్స్ జియో రూ.57,122 కోట్ల బిడ్ దాఖలు చేయగా, ఎయిర్టెల్ రూ.18,669 కోట్ల బిడ్స్, వొడాఫోన్ ఐడియా రూ.1,993 కోట్ల బిడ్స్ దాఖలు చేశాయి. రూ.3.92 లక్షల కోట్ల విలువైన 2250 MHz స్పెక్ట్రంను ఏడు బాండ్స్‌లో అందుబాటులో ఉంచింది. ఇందులో అత్యధికంగా రిలయన్స్ జియో దక్కించుకుంది.
రూ.18,669 కోట్ల విలువైన స్పెక్ట్రంను దక్కించుకున్నట్లు భారతీ ఎయిర్టెల్.. సబ్ గిగా హెర్జ్ట్ కేటగిరీలో 355.45 MHz మిడ్ బ్యాండ్, 2300 MHz బ్యాండ్ స్పెక్ట్రంను సొంతం చేసుకుంది. భవిష్యత్తులో 5G సేవలను అందించేందుకు ఇది దోహదపడుతుందని తెలిపింది. సబ్ గిగా హెర్ట్జ్ స్పెక్ట్రంతో దేశవ్యాప్తంగా తమ సేవలను విస్తరించేందుకు వీలు కలిగిందని తెలిపింది. కొత్తగా తొమ్మిది కోట్లమంది కస్టమర్లను చేర్చుకోనున్నట్లు వెల్లడించింది.

ఇదిలా ఉండగా, ధరలు అధికంగా ఉండడం వల్లే 700 MHz బ్యాండ్‌కు ఎవరూ బిడ్స్ దాఖలు చేయలేదు. ఈ వేలంలో 5G సేవల కోసం గుర్తించిన 3300-3600 MHz బాండ్స్‌ను కలపలేదు. విజయవంతమైన బిడ్డర్లు ఒకేసారి బిడ్ మొత్తాన్ని చెల్లించవచ్చు. లేదంటే తొలుత నిర్దిష్ట మొత్తాన్ని చెల్లించి మిగతా డబ్బును రెండేళ్ల మారటోరియం అనంతరం గరిష్ఠంగా 16 వాయిదాల్లో చెల్లించవచ్చు. ఈ స్పెక్ట్రంను 20 ఏళ్ల పాటు టెలికాం నెట్వర్క్ సంస్థలు వినియోగించుకోవచ్చు.