41 కోట్ల జన్ ధన్ ఖాతాలు, జీరో బ్యాలెన్స్ అకౌంట్స్ 7.5%
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి జన్ ధన్ యోజన (PMJDY) కింద 41 కోట్ల మంది అకౌంట్ తెరిచారని కేంద్ర ఆర్థికమంత్రిత్వ శాఖ మంగళవారం తెలిపింది. జనవరి 6, 2021 నాటికి మొత్తం 41.6 కోట్ల జన్ ధన్ అకౌంట్స్ లబ్ధిదారులు
ఉన్నట్లు తెలిపింది. మార్చి 2015లో 58 శాతంగా ఉన్న జీరో అకౌంట్స్ సంఖ్య ఇప్పుడు 7.5 శాతానికి చేరింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 2014 స్వాతంత్ర్య దినోత్సవాన జన్ ధన్ యోజన పథకాన్ని ప్రకటించారు. ఆగస్ట్ 28న ప్రారంభమైంది.
PMJDYను మెరుగుపరుస్తూ మరిన్ని సదుపాయాలు, ప్రయోజనాలతో 2018లో ప్రభుత్వం PMJDY2.0ను ప్రారంభించింది. ఖాతాలేని వారిపై దృష్టి సారించింది. 28 ఆగస్ట్ 2018 అనంతరం తెరిచిన PMJDY అకౌంట్ హోల్డర్లకు రూపే కార్డులపై ఉచితంగా అందించే ప్రమాద బీమాను రూ. 2లక్షలకు పెంచింది. ఓవర్ డ్రాఫ్ట్ పరిమితిని రెండింతలు చేసి రూ.10 వేలకు పెంచింది. ప్రస్తుత ఆర్బీఐ మార్గదర్శకాల ప్రకారం రెండేళ్ల కాలం పాటు ఖాతా ట్రాన్సాక్షన్స్ లేనట్లయితే PMJDYను పని చేయనిదిగా పరిగణిస్తారు.

ఇదిలా ఉండగా, 2021 జనవరి 8 నాటికి బ్యాంకులు 1.88 కోట్ల కిసాన్ క్రెడిట్ కార్డు (కేసీసీ)ను రూ.1.68 లక్షల కోట్ల క్రెడిట్ పరిమితితో జారీ చేసినట్లు తెలిపింది. ఆత్మనిర్భర్ ప్యాకేజీలో భాగంగా 2020 మే నెలలో కేసీసీ పథకం కింద 2.5 కోట్ల మంది రైతులను స్పెషల్ సాచ్యురేషన్ డ్రైవ్ ద్వారా రూ.2 లక్షల కోట్ల క్రెడిట్ బూస్ట్‌తో కవర్ చేయనున్నట్లు నాడు ప్రభుత్వం ప్రకటించింది.