ట్విట్టర్ బోర్డు నుండి తప్పుకున్న సహ వ్యవస్థాపకులు జాక్ డోర్సే
టెస్లా అధినేత ఎలాన్ మస్క్ మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విట్టర్‌ను కొనుగోలు చేస్తున్న నేపథ్యంలో జాక్ డోర్సేకు బంధం ముగిసింది! ట్విట్టర్ సహ వ్యవస్థాపకుడు, మాజీ సీఈవో అయిన జాక్ డోర్సే బోర్డు నుండి వైదొలిగాడు. తద్వారా ఈ సంస్థతో పూర్తిగా సంబంధాలు తెంచుకున్నాడు. బుధవారం కంపెనీ వాటాదారుల వార్షిక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో బోర్డు డైరెక్టర్లుగా పదవీ కాలం ముగిసిన కొందరిని తిరిగి ఎన్నుకునేందుకు ఎన్నికలు జరిగాయి.
డోర్సే పదవీకాలం కూడా ముగిసింది. కానీ ఆయన మళ్లీ ఎన్నికకు నిలబడలేదు. దీంతో కంపెనీ నుండి ఆయన పూర్తిగా వైదొలిగినట్లు అయింది. జాక్ డోర్సే 2006లో మరో ముగ్గురితో కలిసి ట్విట్టర్‌ను స్థాపించారు. 2007 నుండి డోర్సే బోర్డులో డైరెక్టర్‌గా ఉన్నారు. 2015లో సీఈవోగా నియమితులయ్యారు. అయితే గత ఏడాది నవంబర్ నెలలో పదవికి రాజీనామా చేశారు. డైరెక్టర్‌గా పదవీ కాలం ముగిశాక బోర్డు నుండి కూడా వైదొలుగుతానని అప్పుడే తెలిపారు.

జాక్ డోర్సే ట్విట్టర్‌ను వీడటంతో ఈ సంస్థను స్థాపించిన వారు ఎవరు కూడా ఇప్పుడు సంస్థలో పని చేయడం లేదు లేదా బోర్డు సభ్యులుగా లేరు. ట్విట్టర్ స్థాపన తర్వాత ఇలా జరగడం ఇదే మొదటిసారి. ఎలాన్ మస్క్ ట్విట్టర్‌ను 44 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేస్తోన్న విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం ఈ ఒప్పంద నిలిచిపోయింది. నకిలీ ఖాతాల సంఖ్యపై సంస్థ స్పష్టతను ఇస్తే ఒప్పందం ముందుకు వెళ్తుందని ఎలాన్ మస్క్ తేల్చి చెప్పారు.