నవంబర్ 24వ రకు ఐటీ రీఫండ్స్ రూ.1.36 లక్షల కోట్లు
2020-21 ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ 1 నుంచి నవంబర్ 24 వరకు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు(CBDT) 41.25 లక్షల మందికి పైగా పన్ను చెల్లింపుదారులకు రూ.1,36,962 కోట్లు రీఫండ్ చేసినట్లు ఆదాయ పన్ను శాఖ వెల్లడించింది. ఇందులో 39,28,067 మంది ఆదాయ పన్ను చెల్లింపుదారులకు రూ.36,028 కోట్లు, 1,96,880 మంది కార్పొరేట్ పన్ను చెల్లింపుదారులకు రూ.1,00,934 కోట్లు రీఫండ్ చేసినట్లు ఐటీ విభాగం వివరించింది.
కరోనా నేపథ్యంలో ట్యాక్స్ పేయర్లకు ఇబ్బందులు తలెత్తకుండా కేంద్ర ప్రభుత్వం పన్ను సంబంధిత సేవల్ని ఇబ్బందుల్లేకుండా అందిస్తోంది. ఇందులో భాగంగా ట్యాక్స్ పేయర్స్ రీఫండ్ చేయాల్సిన మొత్తాలను వేగవంతంగా చెల్లిస్తోంది. ఈ మేరకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్(CBDT) పన్ను చెల్లింపుదారులకు సెప్టెంబర్ 29 నాటికి.. 6 నెలల్లోనే రూ.1,18,324 కోట్ల మొత్తాన్ని రీఫండ్ చేసింది.

కోవిడ్ 19 కారణంగా ఆర్థిక వ్యవస్థలు కోలుకుంటున్నాయి. ప్రజల చేతుల్లో డబ్బులు ఉండేందుకు కేంద్రం వివిధ చర్యలు తీసుకుంది. పీఎఫ్ అకౌంట్ నుండి ఉద్యోగులు మూడు నెలల వేతనం లేదా 75 శాతం.. ఏది తక్కువగా ఉంటే ఆ మొత్తం తీసుకునే వెసులుబాటును కల్పించింది. ఐటీ రిటర్న్స్ ఫైలింగ్ తేదీని కూడా పొడిగించి వెసులుబాటు ఇచ్చింది. 2019-20 ఆర్థిక అసెస్మెంట్ సంవత్సరానికి సంబంధించిన ఆదాయపు పన్ను రిటర్న్స్(ఐటీ రిటర్న్స్) దాఖలుకు గడువును నవంబర్ 30వ తేదీ వరకు పొడిగించింది.