బంగారం వంటి ఛాన్స్! పెద్ద కంపెనీల భారీ వేతనం, బోనస్, శాలరీ హైక్
కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికించింది... వణికిస్తోంది. అన్నింటిలో భాగంగా కార్పోరేట్ రంగం కూడా కుదేలయింది. చాలా కంపెనీలు వేతనకోత విధించాయి. ఉద్యోగులను తొలగించాయి. అయితే ఆర్థికరికవరీ కనిపిస్తున్నా కొద్ది జాబ్ మార్కెట్ పుంజుకుంటోంది. ఐటీ మొదలు వివిధ రంగాలు కొత్త నియామకాలు చేపట్టడంతో పాటు వేతనాల పెంపును అమలు చేస్తున్నాయి. ముఖ్యంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కంపెనీలు వీటిలో ముందున్నాయి. కరోనా ఫస్ట్ వేవ్ సమయంలో నియామకాలు 50 శాతం క్షీణించాయి. ఆ తర్వాత అన్ని రంగాల్లో టెక్నికల్ ట్రాన్స్ఫార్మేషన్ పెరగడంతో ఈ రంగం అన్నింటి కంటే వేగంగా పుంజుకుంటుంది. లాక్ డౌన్ నుండి వర్క్ ఫ్రమ్ హోమ్ మోడల్ అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతం నియామకాలు కరోనా ముందుస్థాయికి చేరుకున్నట్లుగా కనిపిస్తోందని అంటున్నారు.

120 శాతం వరకు వేతన పెంపు
ప్రముఖ జాబ్ సెర్చింగ్ పోర్టల్ ఇండీడ్ ఇండియా ప్రకారం ఐటీ ప్రొఫెషనల్స్‌కు డిమాండ్ 400 శాతం పెరిగింది. 'ఇంపాక్ట్ ఆఫ్ కోవిడ్ 19 పాండమిక్ ఆన్ ఇండియా జాబ్ మార్కెట్' పేరుతో ఈ నివేదికను విడుదల చేసింది. స్కిల్డ్ టెక్నికల్ ప్రొఫెషనల్స్‌కు మంచి డిమాండ్ ఉందని తెలిపింది. అప్లికేషన్ డేవలపర్, లీడ్ కన్సల్టెంట్, సేల్స్ ఫోర్స్ డెవలపర్, సైట్ రిలెబులిటీ ఇంజనీర్ వంటి ఉద్యోగాలకు 150 నుండి 300 శాతం మేర డిమాండ్ పెరిగినట్లు తెలిపింది. జనవరి 2020 నుండి ఫిబ్రవరి 2021 మధ్య ఈ డిమాండ్ పెరిగినట్లు తెలిపింది.
వివిధ కంపెనీలు నియామకాలు చేపడుతున్నాయని, అంతేకాకుండా, అంతకుముందు ఏడాదితో పోలిస్తే వేతనాన్ని కూడా ఎక్కువగానే ఆఫర్ చేస్తున్నాయని తెలిపింది. వివిధ ఐటీ కంపెనీలు 70 శాతం నుండి 120 శాతం మధ్య వేతనాన్ని పెంచి నియామకాలు చేపడుతున్నాయని తెలిపింది. అంతకుముందు ఇది 20 శాతం నుండి 30 శాతంగా ఉందని తెలిపింది.

భారీ రిక్రూట్మెంట్ డ్రైవ్
కేవలం వేతన పెంపు మాత్రమే కాకుండా టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, విప్రో, ఇన్ఫోసిస్ వంటి దిగ్గజ ఐటీ సంస్థలు దేశవ్యాప్తంగా నియామకాలు గతంలో కంటే వేగంగా చేపడుతున్నాయి. టీసీఎస్ ఇటీవలే మహిళా ప్రొఫెషనల్స్ కోసం అతిపెద్ద రిక్రూట్మెంట్ డ్రైవ్‌ను చేపట్టింది. ప్రతిభ, సామర్థ్యం ఎల్లవేళలా ఉంటాయి. అనుభవజ్ఞులైన మహిళా నిపుణులకు తిరిగి పనులు ప్రారంభించేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు టీసీఎస్ తెలిపింది. ఇదే విధంగా ఇన్ఫోసిస్, విప్రో సహా ఇతర ఐటీ కంపెనీలు రానున్న కొన్ని నెలల్లో భారీ ఎత్తున నియామకాలు చేపట్టనున్నట్లు ఇండీడ్ నివేదిక పేర్కొంది. సరైన నైపుణ్యాలున్న ఉద్యోగులకు ఐటీ రంగంలో మంచి అవకాశాలు ఉన్నాయని వెల్లడించింది.

వేజ్ బిల్ పెరుగుదల
ఐటీ రంగం వేజ్-బిల్ FY22కి 1.6 బిలియన్ డాలర్ల నుండి 1.7 బిలియన్ డాలర్లకు పెరుగుతాయనే అంచనాలు ఉన్నాయి. కొత్త ఉద్యోగం, మంచి వేతనం కోసం ఎదురుచూస్తున్న నిపుణులకు ఇది సువర్ణావకాశమని ఇండీడ్ పేర్కొంది. ఐటీ కంపెనీలు కేంద్రీకృతమైన బెంగళూరు, హైదరాబాద్, చెన్నై తదితర నగరాల్లో రియాల్టీ వ్యాపారాలు పుంజుకునే అవకాశం ఉంది. టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో సహా వివిధ ఐటీ కంపెనీలు ఈ ఆర్థిక సంవత్సరం మరిన్ని నియామకాలు చేపడతామని ఇదివరకే ప్రకటించిన విషయం తెలిసిందే.