మార్చి తర్వాత రూ.5, రూ.10, రూ.100 నోట్లు చెల్లవా? ప్రభుత్వం ఏమంటోంది
న్యూఢిల్లీ: పాత రూ.5, రూ.10, రూ.100 నోట్లని భారతీయ రిజర్వ్ బ్యాంక్ వెనక్కి తీసుకోనుందని కొద్ది రోజులుగా నెట్టింట, వాట్సాప్ వంటి వాటిల్లో చక్కర్లు కొడుతున్నాయి. ఏప్రిల్ నాటికి వీటి చలామణిని పూర్తిగా నిలిపివేయాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) నిర్ణయించిందని సోషల్ మీడియాలో వార్తలు షికారు చేస్తున్నాయి. ఇప్పటికే చాలా రోజులుగా రూ.10 కాయిన్ తీసుకోవడానికి చాలామంది వెనుకాడుతున్నారు. ప్రస్తుతం ఈ వార్తల నేపథ్యంలో రూ.5, రూ.10, రూ.100 నోట్లు తీసుకోవడానికి ఏమాత్రం ఇష్టపడటం లేదు. ఆ నోట్లు చెల్లవట... వద్దు అని చెబుతున్నారు. దీనిపై ప్రభుత్వం స్పందించింది.

ప్రచారం ఇలా..
రూ.100, రూ.10, రూ.5 పాత కరెన్సీ నోట్లను మార్చి, ఏప్రిల్ నాటికి చెలామణి నుంచి తప్పించాలని ఆర్బీఐ యోచిస్తున్నట్టు డిస్ట్రిక్ట్ లెవల్ సెక్యూరిటీ కమిటీ(DLSC), డిస్ట్రిక్ట లెవల్ కరెన్సీ మేనేజ్మెంట్ కమిటీ(DLMC) సమావేశంలో ఆర్బీఐ అసిస్టెంట్ జనరల్ మేనేజర్(AGM) చెప్పారని కథనాలు వచ్చాయి. ఇప్పటికే పాత నోట్ల స్థానంలో కొత్త రూ.100, రూ.10, రూ.5 నోట్లు వచ్చాయి.

అది అబద్దం
సోషల్ మీడియా, ఇతర ఇంటర్నెట్ ప్లాట్‌ఫాంలలో వైరల్ అవుతోన్న నకిలీ వార్తలను మోడీ ప్రభుత్వం నేతృత్వంలోని PIB ఫ్యాక్ట్ చెక్ బృందం మరోసారి బయటపెట్టింది. PIB ఫ్యాక్ట్ చెక్ ప్రకారం... 2021 మార్చి తర్వాత రూ.5, రూ.10, రూ.100 డినామినేషన్ నోట్లు చెల్లవని ఆర్బీఐ సమాచారం ఇచ్చినట్లు ప్రచారం సాగుతోంది. అయితే ఈ సమాచారం తప్పు అని, ఆర్బీఐ చెప్పుతున్నట్లుగా జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని PIB తేల్చి చెప్పింది.

ఇలాంటివి నమ్మవద్దు
పాత రూ.100, రూ.10, రూ.5 నోట్లు చలామణిలో ఉండబోవనే వార్తలను కొట్టిపారేయడంతో పాటు ఈ నోట్లకు సంబంధంచి ఆర్బీఐ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని PIB ఫ్యాక్ట్ చెక్ తెలిపింది. ఇలాంటి అసత్య ప్రచారాలను నమ్మవద్దని ప్రజలకు సూచన చేసింది. గత కొద్ది కాలంగా కేంద్ర ప్రభుత్వ పథకాలు, నిర్ణయాలు, ప్రభుత్వరంగ సంస్థలకు సంబంధించిన అంశాలపై తప్పుడు ప్రచారం జరుగుతుంటే PIB ఫ్యాక్ట్ చెక్ స్పష్టత ఇస్తోంది.