కొత్త ఏడాదిలో ఐపీవో హెవీ ట్రాఫిక్: కళ్యాణ్ జ్యువెల్లర్స్ ఫస్ట్! ఎల్ఐసీ వస్తే కనుక...
సెకండరీ మార్కెట్లో కనిపిస్తున్న జోష్ ప్రైమరీ మార్కెట్కు విస్తరిస్తోంది. 2021లో మరిన్ని కంపెనీలు IPOకు రానున్నాయి. దాదాపు రూ.30,000 కోట్ల సమీకరణకు 30 కంపెనీలు సిద్ధమయ్యాయి. ఇందులో కల్యాణ్ జ్యువెలర్స్, ఇండిగో పేయింట్స్, స్టోవ్ క్రాఫ్ట్, షంహీ హోటల్స్, అపీజె సురేంద్ర హోటల్స్, న్యూరేకా, మిస్టర్స్ బెక్టార్స్ ఫుడ్, ఫుడ్ డెలివరీ యాప్ యూనీకార్న్ జొమాటో వరుసలో ఉన్నాయి. వీటి ఐపీఓలకు సెబీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రభుత్వరంగ సంస్థ ఎల్ఐసీ కూడా ఐపీవోకి వస్తే రికార్డ్లు సృష్టించనుంది. ఎల్ఐసీ వ్యాల్యూ దాదాపు ట్రిలియన్ల రూపాయలు ఉంటుంది.
IPO news: మరిన్ని ఐపీవో కథనాలు

ఈ ఏడాది ఐపీవోలు..
కరోనా ప్రభావం లేని 2019తో పోలిస్తే 2020లో ఐపీవోలు అదరగొట్టాయి. ఈ ఏడాది నవంబర్ నాటికి దాదాపు రూ.25,000 కోట్ల మొత్తాన్ని వివిధ కంపెనీలు ఐపీవో ద్వారా సమీకరించాయి. ఈ నెల 2న బర్గర్ కింగ్ రూ.810 కోట్ల మొత్తాన్ని సమీకరించింది. ఈ ఏడాది ఇప్పటి వరకు ఎస్బీఐ కార్డ్స్ అండ్ పేమెంట్ సర్వీసెస్, గ్లాండ్ ఫార్మా, సీఏఎంఎస్, యూటీఐ అసెట్స్ మేనేజ్మెంట్, రోజరీ బయోటెక్, హ్యాపియెస్ట్ మైండ్స్ టెక్నాలజీస్, రూట్ మొబైల్స్, కెమ్కాన్ స్పెషాలిటీస్ కెమికల్స్, ఏంజెల్ బ్రోకింగ్, ఈక్విటీ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, లిఖిత ఇన్ఫ్రా, మజగావ్ డాక్ షిప్ బిల్డర్స్ తదితర సంస్థలు ఐపీవో ద్వారా నిధులు సమీకరించాయి. ఈ ఏడాది ఇప్పటి వరకు 13 ఐపీవోలు పూర్తవగా, ఇటీవల బర్గర్ కింగ్ ఐపీవోకు వచ్చింది.

ఎల్ఐసీ పబ్లిక్ ఇష్యూకి వస్తే..
2021లోను ఐపీవోలు భారీగా రానున్నాయి. 30కి పైగా కంపెనీలు పబ్లిక్ ఇష్యూల ద్వారా రూ.30,000 కోట్లు సమీకరించేందుకు సిద్ధమవుతున్నాయి. 2021లో ఐపీవోకు వస్తున్న కంపెనీల్లో వినియోగ ఆధారిత రంగానికి చెందినవి ఎక్కువగా ఉన్నాయి. కళ్యాణ్ జ్యువెల్లర్స్, ఇండిగో పెయింట్స్, జొమాటో వంటివి ఉన్నాయి. ఇందులో ఎక్కువ భాగం 2021 మొదటి త్రైమాసికంలో వస్తున్నాయి. ఎల్ఐసీ మెగా ఇష్యూ ద్వారా 2021లో నిధులు సమీకరిస్తే సమీప భవిష్యత్తులో ఈ రికార్డును అధిగమించే అవకాశం లేదని అంటున్నారు.

కళ్యాణ్ జ్యువెల్లర్స్ రూ.1750 కోట్ల సమీకరణ టార్గెట్
కళ్యాణ్ జ్యువెల్లర్స్ రూ.1750 కోట్ల సమీకరణ లక్ష్యంతో ఐపీవోకు వచ్చే అవకాశం ఉంది. సెబి అనుమతించింది. 2021లో ఐపీవోకు వచ్చే సంస్థ ఇదే మొదటిది అయ్యే అవకాశముంది. ఇండిగో పెయింట్స్ రూ.1000 కోట్లు సమీకరించాలని భావిస్తోంది.