రూ.5 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరి, మార్కెట్ నష్టాలకు కారణాలివే
స్టాక్ మార్కెట్ గురువారం కుప్పకూలుతోంది. అంతర్జాతీయ మార్కెట్ బలహీన సంకేతాలతో పాటు ద్రవ్యోల్భణ భయాలు సూచీలను నష్టాల్లోకి తీసుకెళ్తున్నాయి. నేడు భారీ నష్టాల్లో ప్రారంభమైన సూచీలు, ఆ తర్వాత అంతకంతకూ పడిపోతున్నాయి. మధ్యాహ్నం గం.1 సమయానికి సెన్సెక్స్ ఏకంగా 1300 పాయింట్లు పడిపోయింది. దీంతో 52,000 మార్కు దిగువకు చేరుకుంది. నిఫ్టీ కీలక 15,850 పాయింట్ల దిగువకు వచ్చింది. సూచీలు ఏ దశలోను కోలుకోవడం లేదు. పైగా అంతకంతకూ దిగజారుతున్నాయి.

2.5 శాతం పతనం
ఉదయం దాదాపు 1200 పాయింట్ల (53,070 వద్ద) నష్టాల్లో ప్రారంభమైన సెన్సెక్స్, ఆ తర్వాత స్వల్పంగా కోలుకొని, 53,356 వద్ద ట్రేడ్ అయింది. కానీ అంతకుమించి పుంజుకోలేదు. కాసేపటికే మరింత నష్టాల్లోకి జారుకుంది. మధ్యాహ్నం గం.1.30 సమయానికి సెన్సెక్స్ 2.5 శాతం లేదా 1339 పాయింట్లు క్షీణించి 52,869 పాయింట్ల వద్ద ట్రేడ్ అయింది. నిఫ్టీ 408 పాయింట్లు క్షీణించి 15,832 పాయింట్ల వద్ద ట్రేడ్ అయింది. రెండు సూచీలు కూడా 2.5 శాతం మేర పతనమయ్యాయి.

గంటల్లో రూ.5 లక్షల కోట్లకు పైగా
మార్కెట్లు కుప్పకూలడంతో నేడు ఇన్వెస్టర్ల సంపద భారీగా పడిపోయింది. ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.5 లక్షల కోట్లకు పైగా తగ్గింది. బీఎస్ఈ మార్కెట్ క్యాప్ నిన్న రూ.2,55,77,445.81 కోట్లుగా ఉండగా, నేడు రూ.2.50 లక్షల కోట్లకు పడిపోయింది.

అందుకే నష్టాలు
బుధవారం అమెరికా మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. ఆ ప్రభావం ఆసియా, భారత మార్కెట్లపై పడింది. దీనికి తోడు విదేశీ నిధులు వెనక్కి వెళ్లడం మార్కెట్‌కు మైనస్‌గా మారింది. చమురు ధరలు కూడా మళ్లీ పెరుగుతున్నాయి. ద్రవ్యోల్భణ ఆందోళనలు కమ్ముకున్నాయి. దీంతో అన్ని రంగాలు నష్టాల్లో ఉన్నాయి. వడ్డీ రేట్ల పెంపు వేగవంతమవుతుందనే అంశం కూడా నష్టాలకు కారణం. డాలర్ మారకంతో రూపాయి వ్యాల్యూ తగ్గింది.