ఊగిసలాటలో స్టాక్ మార్కెట్లు, సెన్సెక్స్ నష్టాల్లో ప్రారంభమై....
దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం అతి స్వల్ప లాభాల్లో ప్రారంభమైనప్పటికీ, ఆ తర్వాత భారీ నష్టాల్లోకి వెళ్లాయి. మధ్యాహ్నం గం.11.30 సమయంలో నష్టాలు కాస్త మాత్రమే తగ్గాయి. మార్కెట్లు లాభనష్టాల మధ్య ఊగిసలాటలో ఉన్నాయి. సోమవారం అమెరికా మార్కెట్లు భారీ లాభాల్లో ముగిశాయి. అయితే యూఎస్ ఫ్యూచర్స్ నష్టాల్లో కదలాడుతున్నాయి. దీంతో అమెరికా మార్కెట్ లాభాల ప్రభావం ఆసియా మార్కెట్ల పైన కనిపించడం లేదు.
ద్రవ్యోల్భణం, ఆర్థిక మాంద్యం భయాలలో చిక్కుకున్న మార్కెట్లకు కొత్తగా ఎలాంటి ఆశాజనక పరిణామాలు కనిపించడం లేదు. దీంతో మార్కెట్లు పరిమిత శ్రేణిలో కదలాడుతున్నాయి. కనిష్టాల వద్ద కొనుగోళ్లు, గరిష్టాల వద్ద అమ్మకాల వ్యూహంతో ఇన్వెస్టర్లు ముందుకు సాగుతున్నారు. తైవాన్, ఉక్రెయిన్ పైన రష్యా యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు జోబిడెన్ చేసిన వ్యాఖ్యలు, ప్రతి స్పందన భౌగోళిక రాజకీయ పరిణామాలు సూచీలపై ప్రభావం చూపుతున్నాయి. ఇన్ని పరిణామాల నేపథ్యంలో సూచీలు నష్టాల్లో ఉన్నాయి.

సెన్సెక్స్ 54,307.56 పాయింట్ల వద్ద ప్రారంభమై, 54,463.13 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 54,021.27 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. నిఫ్టీ 16,225.55 పాయింట్ల వద్ద ప్రారంభమై, 16,262.80 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 16,117.10 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. మధ్యాహ్నం గం.11.40 సమయానికి సెన్సెక్స్ 31 పాయింట్లు నష్టపోయి 54,257 పాయింట్ల వద్ద, నిఫ్టీ 33 పాయింట్లు క్షీణించి 16,181 పాయింట్ల వద్ద కదలాడింది. సెన్సెక్స్ ఓ సమయంలో 260 పాయింట్ల మేర నష్టపోయింది.