సెన్సెక్స్ పరుగు, రిలయన్స్ అదుర్స్: ఇన్వెస్టర్ల సంపద రూ.275 లక్షల కోట్లు క్రాస్
దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం భారీ లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. సెన్సెక్స్ నేడు ఉదయం 500 పాయింట్లకు పైగా లాభపడింది. చాన్నాళ్లకు ఈ సూచీ 61,000 పాయింట్లను క్రాస్ చేసింది. 61,014 పాయింట్ల వద్ద ప్రారంభమైన సెన్సెక్స్, 61,143 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 60,850 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. నిఫ్టీ 18,170 పాయింట్ల వద్ద ప్రారంభమై, 18202 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 18,128 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. ఈ వార్త రాసే సమయానికి (గం.11.15) సెన్సెక్స్ 507 పాయింట్లు లాభపడి 61,124 వద్ద, నిఫ్టీ 137 పాయింట్లు ఎగిసి 18,193 పాయింట్ల వద్ద ట్రేడ్ అయింది.

అదరగొడుతున్న రిలయన్స్
దేశీయంగా ప్రీ-బడ్జెట్ ఆశలు, దేశీయ కార్పోరేట్ కంపెనీల మూడో త్రైమాసిక ఫలితాలపై సానుకూల అంచనాలు సూచీలకు మద్దతుగా నిలుస్తున్నాయి. నేడు మూడు ఐటీ దిగ్గజ కంపెనీలు ఇన్ఫోసిస్, టీసీఎస్, విప్రో మూడో త్రైమాసిక ఫలితాలను ప్రకటిస్తున్నాయి. ఫలితాలు సానుకూలంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. అంతేకాదు, ఐటీ స్టాక్స్ మున్ముందు మరింత రాణించే అవకాశాలు ఉన్నాయని మార్గెట్ వర్గాల అంచనా. దీంతో స్టాక్స్ పరుగులు పెడుతున్నాయి. బజాజ్ ట్విన్స్, రిలయన్స్ ఇండస్ట్రీస్ అదరగొడుతున్నాయి. రిలయన్స్ నేడు దాదాపు మూడు శాతం లాభపడి రూ.2520 వద్ద ఉంది.

టాప్ గెయినర్స్, లూజర్స్
నేటి టాప్ గెయినర్స్ జాబితాలో రిలయన్స్, బజాజ్ ఫైనాన్స్, హిండాల్కో, బజాజ్ ఫిన్ సర్వ్, మహీంద్రా అండ్ మహీంద్రా ఉన్నాయి. టాప్ లూజర్స్ జాబితాలో సిప్లా, టైటాన్ కంపెనీ, దివిస్ ల్యాబ్స్, టీసీఎస్, శ్రీ సిమెంట్స్ ఉన్నాయి. మోస్ట్ యాక్టివ్ స్టాక్స్‌లో HDFC బ్యాంకు, రిలయన్స్, బజాజ్ ఫైనాన్స్, ఐసీఐసీఐ బ్యాంకు, వొడాఫోన్ ఐడియా ఉన్నాయి.

రూ.2.75 లక్షల కోట్లకు పైగా..
బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ నిన్నటితోనే సరికొత్త గరిష్టాలకు చేరుకుంది. మంగళవారం ఈ మార్కెట్ క్యాప్ రూ.275.20 లక్షల కోట్లకు చేరుకుంది. 30 షేర్ బీఎస్ఈ సూచీ వరుసగా నాలుగు రోజులుగా లాభాల్లో ట్రేడ్ అవుతోంది. వరుస నాలుగు రోజుల లాభాల నేపథ్యంలో సెన్సెక్స్ 1500 పాయింట్లకు పైగా ఎగిసింది. నిన్నటికి వెయ్యి పాయింట్లకు పైగా లాభపడింది. దీంతో నిన్నటి వరకు మూడు రోజుల్లో ఇన్వెస్టర్ల సంపద రూ.4,05,806 ఎగిసి రూ.275 లక్షల కోట్లు దాటింది.