భారత్ సూపర్, ఆహార భద్రతకు ప్రాధాన్యతపై ఐఎంఎఫ్ సూచన
భారత్ తన వార్షిక బడ్జెట్లో ప్రభుత్వ పెట్టుబడులకు ప్రాధాన్యతను ఇచ్చినందుకు ఇంటర్నేషనల్ మానిటరింగ్ ఫండ్ (IMF) ప్రశంసిస్తూ.... ఉక్రెయిన్-రష్యా యుద్ధం కారణంగా ప్రపంచ ఆర్థిక సంక్షోభం ఏర్పడిన నేపథ్యంలో ఆహార భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని, బలహీనులకు బదలీని విస్తరించాలని కోరింది. ఐఎంఎఫ్ ఆర్థిక వ్యవహారాల విభాగం డిప్యూటీ డైరెక్టర్ పాలో మారో బుధవారం విలేకరుల సమావేశంలో ఐఎంఎఫ్, ప్రపంచ బ్యాంకు యాన్యువల్ స్ప్రింగ్ మీటింగ్ సందర్భంగా మాట్లాడారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో ఈ ఆర్థిక పరిణామాల నుండి వస్తున్న సవాళ్లను ప్రస్తావించారు.
భారత్లో ద్రవ్యోల్భణం కొంతవరకు పెరిగినట్లు గుర్తించామని తెలిపారు. ఈ సమస్యను ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్న కేంద్ర బ్యాంకు ఆర్బీఐ కంఫోర్ట్ జోన్ కంటే ఇది కాస్త ఎక్కువగా ఉందని తెలిపారు. ఆర్థికబరంగా బడ్జెట్ దాదాపు తటస్థంగా ఉందని, ఈ సమయంలో ఇది వివేకవంతంగా ఉందన్నారు.

అయితే ఆహార ధరల పెరుగుదలను, ఇంధన ధరల పెరుగుదలను బట్టి చూస్తే ఇది కుటుంబాలకు ఇబ్బందికరంగా ఉందని అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో మొదట ఆహార భద్రతకు ప్రాధాన్యతను ఇవ్వడం, బలహీన వర్గాలకు బదలీని విస్తరించడం అవసరమని సూచించారు. భారత ప్రజలకు ప్రభుత్వం కరోనా వంటి కీలక సమయంలో ఆహార సరఫరా, నగదు బదలీని సమర్థవంతంగా నిర్వహించిందని, ఇది కొనసాగాలని, విస్తరించాలన్నారు. మరో విషయం ఏమంటే ప్రభుత్వ పెట్టుబడులకు ప్రాధాన్యత ఇవ్వడం ఓ మంచి అంశమన్నారు.