గుడ్న్యూస్, కరోనా ముందుస్థాయికి నియామకాలు: మున్ముందు మరింత వృద్ధి
కరోనా వైరస్ నేపథ్యంలో ఏప్రిల్ నుండి చాలామంది ఉద్యోగాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ప్రధానంగా హాస్పిటాలిటీ, విమానయానం, టూరిజం రంగాలపై భారీగా ప్రభావం పడింది. అన్-లాక్ నేపథ్యంలో మే, జూన్ నుండి నియామకాలు క్రమంగా పెరుగుతున్నాయి. ఉద్యోగాల భర్తీ ప్రక్రియ కరోనా ముందుస్థాయికి చేరుకుంటోందని సర్వేలు వెల్లడిస్తున్నాయి. అన్-లాక్ తర్వాత ఆర్థిక కార్యకలాపాలు తిరిగి ప్రారంభం కావడంతో పూర్వస్థితికి చేరుకుంటున్నట్లు ప్రయివేటు కంపెనీల కోసం ఉద్యోగులను ఎంపిక చేసే సంస్థ క్వెస్ కార్పోరోషన్ తెలిపింది.
లాక్ డౌన్ అనంతరం భారీగా తగ్గిన నియామకాలు, అక్టోబర్ నెలలో పెరుగుదల కనిపించిందని తెలిపింది. మార్చిలో ఈ సంఖ్య 55వేలుగా ఉండగా, ఇప్పుడు 3.25 లక్షలకు చేరుకుందని వెల్లడించింది. ఉపాధి రంగం వేగంగా పుంజుకుంటోందని, క్లిష్టమైన పరిస్థితుల నుండి బయటపడ్డామని అభిప్రాయపడింది.

ఏప్రిల్ నెలలో 23.5 శాతంగా ఉన్న నిరుద్యోగిత రేటు అక్టోబర్ నెలలో 7 శాతం దిగువకు వచ్చినట్లు తెలిపారు. కరోనాకు ముందు ఉన్న ఆరు శాతానికి త్వరలో వస్తామని వెల్లడించింది. కరోనా సమయంలో ఉద్యోగాల కోత, వేతనాల కోత కనిపించగా, ఇప్పుడు దాదాపు అన్నీ కుదురుకున్నాయని తెలిపింది. రానున్న త్రైమాసికాల్లో మరింత వృద్ధి కనిపిస్తుందని తెలిపింది.