మూడో త్రైమాసికంలో భారత జీడీపీ వృద్ధి రేటు 5.4 శాతం
2021-22 ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికం (అక్టోబర్-డిసెంబర్) కాలంలో భారత ఆర్థిక వ్యవస్థ నెమ్మదించింది. గత త్రైమాసికంలో జీడీపీ వృద్ధి రేటు 5.4 శాతానికి పరిమితమైంది. 2020-21లో ఇదే త్రైమాసికంలో 0.7 శాతంగా మాత్రమే ఉంది. అప్పుడు కరోనా కారణంగా ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతిన్నది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో 20.3 శాతం, రెండో త్రైమాసికంలో 8.5 శాతంగా వృద్ధి రేటు నమోదయింది.
కరోనా నేపథ్యంలో మూడో దశ వ్యాప్తి నియంత్రణకు చర్యలు, తయారీ, వ్యవసాయ రంగాల్లో వృద్ధి నెమ్మదించడం వల్ల దేశ వృద్ధి రేటు తగ్గింది. కానీ ప్రధాన దేశాల ఆర్థిక వ్యవస్థలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న దేశంగా భారత్ నిలిచింది. అక్టోబర్-డిసెంబర్ కాలంలోచైనా వృద్ధి రేటు 4 శాతమే. ప్రస్తుత పూర్తి ఆర్థిక సంవత్సరానికి వృద్ధి రేటు 8.9 శాతంగా నమోదు కావొచ్చునని ఎన్ఎస్ఓ తాజాగా అంచనా వేస్తోంది. ఇంతకుముందు జనవరిలో మొదటి ముందస్తు అంచనా 9.2 శాతం కంటే ఇది తక్కువ.

స్థిర ధరలు (2011-12) ప్రకారం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం గత త్రైమాసికంలో జీడీపీ వ్యాల్యూ రూ.38.22 లక్షల కోట్లుగా ఉంది. గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో రూ.36.26 లక్షల కోట్లతో పోలిస్తే ఇది 5.4 శాతం అధికం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రియల్ జీడీపీ రూ.147.72 లక్షల కోట్లకు చేరుతుందని అంచనాలు ఉన్నాయి. వార్షిక వృద్ధి రేటు అంచనాలతో పోలిస్తే అక్టోబర్-డిసెంబర్ వృద్ధి రేటు తక్కువగా ఉంది. ఇందుకు ప్రధానంగా తయారీరంగ వృద్ధి తగ్గడమే కారణం.