ఒమిక్రాన్ ప్రభావం, కేంద్రం అదనపు వ్యయంతో నష్టం భర్తీ
కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కారణంగా నాలుగో త్రైమాసికంలో భారత జీడీపీ వృద్ధిపై 40 బేసిస్ పాయింట్ల మేర ప్రభావం పడవచ్చునని ప్రముఖ రేటింగ్ ఏజెన్సీ ఇక్రా అంచనా వేసింది. దీంతో జీడీపీ వృద్ధి రేటు నాలుగో త్రైమాసికంలో 4.5 శాతం నుండి 5 శాతం మధ్య ఉండవచ్చునని పేర్కొంది. థర్డ్ వేవ్ ఇప్పుడిప్పుడే ప్రారంభమైందని, కాబట్టి పూర్తి అంచనాలు ఇప్పుడే కష్టమని అభిప్రాయపడింది. కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వేగాన్ని బట్టి వృద్ధి రేటు అంచనాలు మారవచ్చునని తెలిపింది. ముఖ్యంగా కాంటాక్ట్ ఇంటెన్సివ్ రంగాల్లో ఆర్థిక కార్యకలాపాలను ప్రభావితం చేసే మరిన్ని మొబిలిటీ ఆంక్షలు ఉండవచ్చునని ఇక్రా చీఫ్ ఎకనమిస్ట్ అదితి నాయర్ అన్నారు. ఇక్రా ప్రకారం మార్చి త్రైమాసికంపై ఒమిక్రాన్ ప్రభావం భారత జీడీపీలో 40 బేసిస్ పాయింట్లు లేదా 0.4 శాతం కోత ఉండవచ్చు.

ఆర్థిక సంవత్సర వృద్ధి రేటు.. సవరణ తొందరపాటు
అయితే 2021-22 ఆర్థిక సంవత్సరం పూర్తి ఆర్థిక సంవత్సరానికి గాను వృద్ధి రేటు 9 శాతం వరకు ఉండవచ్చునని ఇక్రా అంచనా వేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి రెండు త్రైమాసికాల్లో జీడీపీ వృద్ధి రేటు 20.1 శాతం, 8.4 శాతంగా నమోదయింది. ఆర్బీఐ అంచనాల ప్రకారం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు 9.5 శాతంగా ఉండవచ్చు. వివిధ ఆర్థిక సంస్థలు 8.5 శాతం నుండి 10 శాతం వరకు ఉండవచ్చునని పేర్కొన్నాయి. పూర్తి ఆర్థిక సంవత్సరానికి గాను వృద్ధి రేటు అంచనాలను సవరించడం తొందరపాటు అవుతుందని అదితి నాయర్ అన్నారు. ఎందుకంటే ఒమిక్రాన్ థర్డ్ వేవ్ ప్రభావంపై ఆధారపడి ఉంటుందన్నారు. ఇది మాత్రమే కాకుండా డిసెంబర్ గవర్నమెంట్ స్పెండింగ్ డేటా రావాల్సి ఉందన్నా

కేంద్ర అధిక వ్యయంతో భర్తీ
గత నెల ప్రారంభంలో సెకండ్ సప్లిమెంటరీ గ్రాంట్స్ రూపంలో రూ.3.73 లక్షల కోట్ల అదనపు వ్యయాన్ని కేంద్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంటే, గత నెలలో ప్రభుత్వ వ్యయం ఇప్పటికే పెరిగి ఉంటుందని తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మిగతా కాలంలో (జనవరి-మార్చి) కాలంలోను ఇది పెరగవచ్చునని వెల్లడించారు. థర్డ్ వేవ్ ప్రభావం ఉన్నప్పటికీ, కేంద్ర అధిక వ్యయం నష్టాన్ని కొంతమేర భర్తీ చేస్తుందన్నారు.

మందగమనం, సరఫరా గొలుసుపై ప్రభావం
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో వృద్ధి రేటును 6 శాతం నుండి 6.5 శాతంగా అంచనా వేస్తోంది. నవంబర్ నెలలో హై-ఫ్రీక్వెన్సీ సూచీలు ఫ్లాట్గా ఉన్నాయని, పండుగ సీజన్లో కాస్త పుంజుకున్నప్పటికీ, ఆ తర్వాత మందగించాయని, దక్షిణాదిలో భారీ వర్షపాతం కారణంగా సరఫరాలో అంతరాయాలు ఏర్పడుతున్నాయని తెలిపింది. థర్డ్ వేవ్ ప్రభావం రాబోయే వారాల్లో వివిధ రాష్ట్రాలకు విస్తరించే అంశంపై వృద్ధి రేటు ఆధారపడి ఉంటుందని తెలిపారు. ఈ నేపథ్యంలో 2021-22 ఆర్థిక సంవత్సరానికి వృద్ధి రేటు అంచనాలను 9 శాతంగా ఇక్రా పేర్కొంది.