డిజిటల్ ఎకానమిపై నిర్మలమ్మ కీలక వ్యాఖ్యలు: 2030 నాటికి
న్యూఢిల్లీ: దేశ డిజిటల్ ఎకానమిపై కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మల సీతారామన్ కీలక వ్యాఖ్యలు చేశారు. 2030 నాటికి దీని పురోగమనం ఎలా ఉంటుందనేది అంచనా వేశారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందిన పరిస్థితుల నుంచి గట్టెక్కడం, రష్యా-ఉక్రెయిన్ మధ్య కొనసాగుతున్న యుద్ధం ప్రభావం, ప్రతి సంవత్సరం పెరుగుతూ వస్తోన్న ద్రవ్యోల్బణం.. వంటి ప్రతికూల వాతావరణంలో దేశ ఆర్థిక వ్యవస్థ వచ్చే ఎనిమిదేళ్లలో ఎలా ఉండొచ్చనే విషయంపై తన అభిప్రాయాలను తెలిపారు.
ఐఐటీ- బోంబే ఆలమ్నీ అసోసియేషన్‌ను ఉద్దేశించి ఆమె ప్రసంగించారు. వర్చువల్ విధానంలో ఈ కార్యక్రమం కొనసాగింది. 2030 నాటికి దేశంలో డిజిటల్ విప్లవం పతాక స్థాయికి చేరుకుంటుందని పేర్కొన్నారు. వచ్చే ఎనిమిదేళ్లల్లో 800 బిలియన్ డాలర్ల మేర డిజిటల్ ఎకానమి గ్రోత్ నమోదవుతుందని అంచనా వేశారు. దేశంలో ఇప్పటికే 6,300 వరకు ఫిన్‌టెక్స్ ఉన్నాయని, ఇందులో ఇన్వెస్ట్మెంట్ టెక్నాలజీలో 27, పేమెంట్స్‌లో 16, బ్యాంకింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో తొమ్మిది శాతం వాటా ఉందని అన్నారు.

2020 క్యాలెండర్ ఇయర్లో 85 నుంచి 90 బిలియన్ డాలర్ల మేర డిజిటల్ ఎకానమి నమోదు చేసుకుందని నిర్మల సీతారామన్ వివరించారు. 2030 నాటికి ఇది 800 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని అంచనా వేస్తున్నామని చెప్పారు. ఇంటర్నెట్ వినియోగం, యువత ఆర్థిక వనరులు పెరగడం వంటి కార్యకలాపాల వల్ల ఇది సాధ్యపడుతుందని వ్యాఖ్యానించారు. స్టాక్ మార్కెట్స్లల్లో రిటైల్ ఇన్వెస్టర్లను ప్రోత్సహించడానికి నిబంధనలను మరింత సరళీకరించామని అన్నారు.
2016 మార్చి నుంచి గత సంవత్సరం మార్చి నాటికి రిటైల్ ఇన్వెస్టర్ల సంఖ్య రెట్టింపయిందని నిర్మల సీతారామన్ చెప్పారు. 45 మిలియన్లుగా ఉన్న రిటైల్ ఇన్వెస్టర్ల సంఖ్య 88.2కు చేరిందని, ఇది మరింత పెరుగుతుందని అభిప్రాయపడ్డారు. డిజిటల్ ఎకానమిని ప్రోత్సహించే క్రమంలో 75 డిజిటల్ బ్యాంకింగ్ యూనిట్లను ప్రకటించిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు. వార్షిక బడ్జెట్లో దీన్ని పొందుపరిచినట్లు చెప్పారు.