నిర్మలమ్మ బడ్జెట్, ఆసియా కుబేరులకు తక్కువకే రుణాలు
Budget 2022: డేటా సెంటర్లు, ఎనర్జీ స్టోరేజ్‌ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ అసెట్‌గా వర్గీకరించే ప్రకటన 2022-23 బడ్జెట్లో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ నుండి వచ్చింది. నిన్న(ఫిబ్రవరి 1, మంగళవారం) ఆర్థిక మంత్రి లోకసభలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఇది ఏప్రిల్ 1వ తేదీ నుండి అమల్లోకి వస్తుంది. బడ్జెట్లో డేటా సెంటర్లు, ఎనర్జీ స్టోరేజ్ సదుపాయాలకు మౌలిక హోదా కల్పిస్తున్నట్లు తెలిపారు. ఇది గౌతమ్ అదానీ నేతృత్వంలోని అదానీ గ్రూప్, ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు, మిట్టల్ నేతృత్వంలోని భారతీ ఎయిర్టెల్ వంటి కంపెనీలకు బిగ్ బూస్ట్ అని చెబుతున్నారు. డేటా సెంటర్స్, ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్ (డెన్స్ చార్జింగ్ ఇన్ఫ్రా, గ్రిడ్ స్కేల్ బ్యాటరీ సిస్టం సహా) హార్మోనైజ్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ జాబితాలో చేర్చుతున్నట్లు తెలిపారు.

అందుకే వారికి చవక రుణాలు
మౌలిక సదుపాయాల అభివృద్ధికి నిర్మలమ్మ తన బడ్జెట్లో పెద్దపీట వేసింది. ఈ చర్యల్లో భాగంగా డేటా సెంటర్స్, ఎనర్జీ స్టోరేజీతో పాటు ఎలక్ట్రిక్ చార్జింగ్ ఇన్ఫ్రా, గ్రిడ్ స్కేల్ బ్యాటరీ సిస్టమ్స్ వంటి ఆధునిక సదుపాయాలకు మౌలిక హోదా కల్పిస్తున్నట్లు ప్రకటించారు. దీంతో ఈ సదుపాయాల ఏర్పాటుకు బ్యాంకుల నుండి రుణాలు చవకగా లభిస్తాయి. ఈ నిర్ణయం ముఖేష్ అంబానీ, గౌతమ్ అదానీ, సునీల్ మిట్టల్ వంటి కార్పొరేట్ దిగ్గజాలకు లబ్ధి చేకూరుస్తుందని నిపుణుల మాట. ఎందుకంటే, ఈ విభాగాల్లో అదానీ, మిట్టల్, అంబానీ భారీ ప్రణాళికలు ప్రకటించారు.

డేటా సెంటర్
భారత్ తన డేటాను ఇక్కడే ఉండేలా చూస్తోంది. ఆన్ లైన్ చెల్లింపులు, ఈ-కామర్స్, క్వాంటం కంప్యూటింగ్‌లో భారీ వృద్ధిని నమోదు చేస్తోంది. అత్యంత వేగవంతమైన 5జీ టెలికం సేవలను అందుబాటులోకి తీసుకు రావడం వల్ల డేటా సెంటర్ సేవలకు డిమాండ్ మరింత పెరుగుతుంది. ఇప్పటికే ఆసియా కుబేరుడు అంబానీ 76 బిలియన్ డాలర్ల పెట్టుబడి ప్లాన్‌ను ప్రకటించారు. తాజా నిర్మలమ్మ ప్రకటన వారికి ప్రయోజనం చేకూరుస్తుంది.

కార్బన్ నెట్ జీరో
2070 నాటికి కార్బన్ నెట్ జీరోగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకుంది ప్రభుత్వం. గత నవంబర్ నెలలో గ్రీన్ స్టోరేజ్‌లో ప్రపంచ అగ్రగామిగా ఉండాలని కోరుకుంటున్నట్లు ఆసియా నెంబర్ టూ కుబేరుడు అదానీ ప్రకటించారు. అదానీ గ్రూప్ ముంబై, చెన్నై, హైదరాబాద్, న్యూఢిల్లీ ప్రాంతాల్లో వీటిని నిర్మించే ప్రక్రియలో ఉంది.
ఇక, డేటా సెంటర్ కెపాసిటీకి 50 బిలియన్ల రూపాయలు ఇన్వెస్ట్ చేస్తామని సెప్టెంబర్‌లో భారతీ ఎయిర్టెల్ ప్రకటించింది. 2025 నాటికి 400 మెగావాట్ల సామర్థ్యాన్ని లక్ష్యంగా పెట్టుకుంది. రిలయన్స్ డిజిటల్ కూడా ఈ దిశగా అడుగు వెస్తోంది.