ఒమిక్రాన్ ఎఫెక్ట్, భారత ఆతిథ్యరంగానికి రూ.200 కోట్ల నష్టం
కరోనా కొత్త వేరియంట్ లేదా థర్డ్ వేవ్ ఒమిక్రాన్ ప్రభావం ఆతిథ్య రంగంపై భారీగానే పడనుంది. కరోనా మొదటి వేవ్ సమయంలో అత్యధిక ప్రభావం పడింది ఆతిథ్య రంగం, విమానయాన రంగం పైనే. ఇవి పూర్తిగా మూతబడ్డాయి. ఆ తర్వాత లాక్ డౌన్ ఆంక్షలు క్రమంగా సడలించడంతో కాస్త కోలుకుంటోంది. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ఈ రంగాన్ని మరోసారి ఒమిక్రాన్ దెబ్బతీస్తోంది. ఒమిక్రాన్ కారణంగా భారత ఆతిథ్య రంగంపై రూ.200 కోట్ల భారీ ప్రభావం పడనుందని అంచనా వేస్తున్నారు.
మహమ్మారి కారణంగా రెండేళ్లుగా ఆతిథ్య రంగం కుదేలవుతోంది. ప్రతి సంవత్సరం కొత్త ఏడాది సమయంలో హోటల్స్, రెస్టారెంట్లు కళకళలాడేవి. కానీ ఈసారి వెలవెలబోయాయి. ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నాయి. దీంతో ప్రపంచవ్యాప్తంగా కొత్త ఏడాదిలో హోటల్స్, రెస్టారెంట్ సంబరాలకు ప్రజలు దూరంగా ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా, భారత్‌లో ముందస్తు బుకింగ్స్ కూడా చాలా వరకు రద్దయ్యాయి. దీంతో దేశంలో రూ.200 కోట్ల ఆదాయాన్ని నష్టపోయినట్లు భారత హోటల్ రెస్టారెంట్ సంఘాల సమాఖ్య ఆవేదన వ్యక్తం చేసింది.

కరోనా కేసులు తగ్గి తిరిగి సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయనే సంతోషం ఓ వైపు ఇప్పుడు ఒమిక్రాన్‌తో ఆవిరైపోయిందని చెబుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వం తమకు చేయూతనివ్వాలని లేదంటే కోలుకోవడం కష్టమని ఇండస్ట్రీ ఆందోళన వ్యక్తం చేస్తోంది. పరిస్థితి ఇలాగే ఆందోళనకరంగా ఉంటే ఉద్యోగులు, కార్మికులు ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉందని చెబుతున్నారు. సంస్థలు కూడా వేతనాలు, రుణాలు చెల్లించలేని పరిస్థితికి వస్తుందని చెబుతున్నారు.