ట్రంప్ ఇండియా టూర్ ఎఫెక్ట్: హార్లీ డేవిడ్సన్ బైక్స్ పై భారత్ కొత్త టారిఫ్‌ల ప్రతిపాదన
న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత పర్యటనకు ముందు కేంద్ర ప్రభుత్వం ప్రముఖ మోటార్ బైక్‌ల సంస్థ హార్లీ డేవిడ్సన్కు గుడ్ న్యూస్ చెప్పింది. ఆ సంస్థ నుంచి తయారయ్యే 1600 సీసీ బైకులపై దిగుమతి సుంకాన్ని సింగిల్ డిజిట్‌కే పరిమితం చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఇది కేవలం హార్లీ డేవిడ్సన్కు మాత్రమే వర్తించదు. మిగతా కంపెనీల బైకులకు కూడా వర్తిస్తుందని ప్రభుత్వం వెల్లడించింది. అమెరికాతో భారత్ వాణిజ్య చర్చలు ప్రారంభించినందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇక బైకుల తయారీకి అమెరికా పెట్టింది పేరు. గతంలో హార్లీ డేవిడ్సన్ బైకులపై భారత్ అధిక దిగుమతి సుంకాన్ని విధించడంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పలు విమర్శలు చేశారు.
హార్లీ డేవిడ్సన్ బైకులపై చెలరేగిన వివాదం ఇప్పటికే ముగిసిందని 1600 సీసీ అంతకుమించి సామర్థ్యం ఉన్న బైకులపై ప్రస్తుతం ఉన్న రెండంకెల దిగుమతి సుంకాన్ని ఒక అంకెకు మాత్రమే పరిమితం చేస్తామని కేంద్ర ప్రభుత్వంలోని ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. ఇలాంటి బైకులకు కొత్త హెచ్ఎస్ కోడ్‌ను తీసుకొస్తామని ఆయన చెప్పారు. ప్రస్తుతం భారత్‌లో ఉన్న 75సీసీ , 250 సీసీ, 500సీసీ ,800 సీసీల సామర్థ్యం ఉన్న ఇంజిన్లను ఒక్కో కేటగిరీలో చేర్చింది. గతేడాది ఏప్రిల్-డిసెంబర్ నెలల మధ్య భారత్ 20.63 మిలియన్ డాలర్లు విలువ చేసే బైకులను దిగుమతి చేసుకుంది. ఇందులో 800 సీసీ ఇంజిన్ కెపాసిట్ ఉన్న బైకులే అధికంగా ఉండటం విశేషం.

గతంలో దిగుమతి సుంకం 100శాతం ఉండగా దాన్ని 50శాతానికి భారత్ తగ్గించింది. దీనిపై కూడా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇది కూడా ఆమోదయోగ్యం కాదని నాడు అన్నారు. ఇక హెచ్-1బీ వీసా ఫీజును తగ్గించాలని అప్పటి వాణిజ్య చర్చల సందర్భంగా భారత్ అమెరికాను కోరింది. భారత్ విధించిన దిగుమతి సుంకంను దృష్టిలో ఉంచుకున్న అమెరికా... హెచ్-1బీ వీసా ఫీజును అమాంతం పెంచాలనే ప్రతిపాదన చేసింది.
అమెరికా పాల ఉత్పత్తులపై ఉన్న టారిఫ్‌లలో కోత విధిస్తున్నామనే వార్తలను భారత్ కొట్టివేసింది.పాల ఉత్పత్తులకు వెటిరినటరీ అధికారులు సర్టిఫికేషన్ తప్పనిసరిగా ఉండాలనే నిబంధన విధించింది. జీఎస్పీ పై కూడా గతేడాది చర్చించడం జరిగింది. అయితే జీఎస్పీపై రాజకీయ జోక్యం ఇప్పుడప్పుడే ఉండది భారత ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. భారత్‌కు ఎలా బెనిఫిట్స్ కావాలో అన్నదానిపై ప్రభుత్వం క్లారిటీ మెయిన్‌టెయిన్ చేస్తోందని అధికారి చెప్పారు. ఒకవేళ ఒప్పందం కుదరకపోతే నేరుగా స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదుర్చుకుంటామని చెప్పారు. ఇక మెడికల్ పరికరాల విషయంలో భారత్ ట్రేడ్ మార్జిన్ విధానం అవలంబించాలని భావిస్తోంది. ఇలా కాకపోతే పరికరాల్లో నాణ్యత లోపించే అవకాశం ఉందని భావిస్తోంది.